రసాభసగా జనగామ మున్సిపల్‌ మీటింగ్‌ 

రసాభసగా జనగామ మున్సిపల్‌ మీటింగ్‌ 
  • పోడియం ముందు బైఠాయించిన కౌన్సిల్‌ సభ్యులు
  • ప్రతిపక్షాలతో కలిసిన బీఆర్‌‌ఎస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం రసాభసగా కొనసాగింది. మంగళవారం చైర్‌‌ పర్సన్‌ పోకల జమున అధ్యక్షతన జరిగిన సమావేశంలో గతంలో టెండర్ అయినా పనుల బిల్లులు ఆలస్యం వల్ల కాంట్రాక్టర్లు పనిచేయడం లేదని  ప్రతిపక్ష కౌన్సిలర్‌‌ అయిన హరిశ్చంద్రగుప్తా, జక్కుల అనిత పోడియం ముందుకు కూర్చొని ఆందోళన చేపట్టారు. అయితే వారితో పాటు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు బండ పద్మ, వాంకుడోత్‌ అనిత, మళ్లిగారి చంద్రకళ, పేర్ని స్వరూప, పాకా రమ, ఎం.డి సమద్, గుర్రం భారతి సైతం బైఠాయించారు. వీరి ధర్నాతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్తా మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలు కట్టిన టాక్స్ ను రూ.10 లక్షలను దుర్వినియోగం చేసి, ఆ ఎజెండాలో  డబ్బు సరిపోలేదని మళ్లీ బిల్లులు పెట్టడం ప్రజల డబ్బులు వృథా  చేయడమే అన్నారు.  

కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గంగరబోయిన మల్లేశ్‌ మాట్లాడుతూ టీపీవో సెక్షన్లో పనిచేసే భిక్షపతిని ఆ సెక్షన్ నుంచి తొలగించాలని గత కౌన్సిల్లో తీర్మానం చేసినా కూడా అదే సెక్షన్ లో ఎలా పనిచేస్తున్నాడని ప్రశ్నించారు. అదేవిధంగా యాదగిరి కూడా సక్రమంగా పనిచేయడం లేదని వెంటనే వీరిని మార్చాలని డిమాండ్ చేశారు. జక్కుల అనిత మాట్లాడుతూ తమ వార్డులో పోల్స్ వేయాలని సంవత్సరం నుంచి కోరుతున్నా ఇప్పటి వరకు పని జరగలేదన్నారు. వార్డు అభివృద్ధి కాకుండా ఇతర పనులకు జనరల్ ఫండ్ ఉపయోగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కౌన్సిలర్ పాండు మాట్లాడుతూ తమ వార్డు టెండర్ అయినా పనులు ఎందుకు జరగడం లేదని, కొందరు ఆఫీసర్లు కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బండ పద్మ మాట్లాడుతూ వచ్చే శ్రావణ మాసం బోనాల సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేయాలని కోరారు. గతంలో అలంకరణ చేసిన పనుల బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రజిత, కౌన్సిలర్లు బొట్ల శ్రీనివాస్, పగిడిపాటి సుధ, సమద్, రామచందర్, ఉడుగుల శ్రీలత, తాళ్ల సురేష్ రెడ్డి  ప్రేమలతారెడ్డి, చందర్, కర్రే శ్రీనివాస్, బాల్దె కమలమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.