టీబీజీకేఎస్ కు పెద్దల గుడ్ బై...?

టీబీజీకేఎస్ కు పెద్దల గుడ్ బై...?
  • రాజీనామా ఆలోచనలో త్రిమూర్తులు...
  • అదే జరిగితే సింగరేణిలో యూనియన్ కనుమరుగే...

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-సింగరేణి కోల్ బెల్ట్  లో తాజా పరిణామం ఒకటి సంచలనం గా మారబోతుంది. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్ ) లో తుఫాను సంకేతాలు కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తుంది. ఆ యూనియన్ కు చెందిన పెద్దలు ముగ్గురు రాజీనామా ఆలోచన లో ఉన్నట్లు విశ్వసనీయ  సమాచారం. అదే గనుక జరిగితే ఇక సింగరేణిలో యూనియన్ ఉనికి ప్రశ్నార్ధకంగా మిగిలి పోనుంది. త్వరలో జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేస్ పోటీ చేయవద్దని  పార్టీ అధినేత నుంచి పిలుపు వచ్చినందుకు ఈ రాజీనామా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ అధిష్టానం కూడా ఆ ముగ్గురు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ యూనియన్ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య లు రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈరోజు సాయంత్రం గాని రేపు గాని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ అధిష్టానం తమ నిర్ణయం ను వెనక్కి తీసుకుంటే యూనియన్ లోనే కొనసాగేందుకు కూడా తమ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలిసింది.