కన్నడ తంత్ర.. సునీల్ మంత్ర

కన్నడ తంత్ర.. సునీల్ మంత్ర
  • రాష్ట్రంలో కాంగ్రెస్ నయా వ్యూహం
  • సోషల్ క్యాంపెయినింగ్ మీదనే దృష్టి​
  • ఐటీ సెక్టార్, విద్యావంతులే టార్గెట్ 
  • నిరుద్యోగులూ, యువత మీదా నజర్
  • మహిళలు, రైతులకు ప్రత్యేక పథకాలు
  • కార్మికులు, ఉద్యోగులకు ఊరించే స్కీములు
  • బీజేపీ బలహీనతలను పట్టుకున్న వ్యూహకర్తలు
  • ప్రజల పల్స్ ఆధారంగానే ఎలక్షన్ రూట్ ప్లాన్
  • కేరళ, తమిళనాడు. కర్ణాటకలో ఇదే తీరు
  • ఇపుడు తెలంగాణలోనూ అవే ప్రణాళికలు!

‘తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో విద్యావంతులు ఎక్కువ. అక్కడ బీజేపీకి వచ్చిన సీట్లూ తక్కువే. యువతను ప్రాంతీయ పార్టీలు ప్రభావితం చేసినంతగా బీజేపీ చేయడం లేదు.70 శాతం మంది యూత్​కాషాయ జెండా పట్టుకోవడం లేదు. ఐటీ సెక్టార్ కూడా యాంటీ బీజేపీ కోణంలోనే ఉంటున్నది’ ఇదే నాడిని పట్టుకున్న సునీల్ కనుగోలు బృందం కర్ణాటకలో ఎన్నికలకు ముందు సోషల్ క్యాంపెయిన్​వార్​మొదలుపెట్టింది. పదుల సంఖ్యలో యూ ట్యూబ్​ఛానళ్లు, వందల సంఖ్యలో ఫేస్ బుక్​ అకౌంట్లు, పదుల సంఖ్యలో డిజిటల్ వెబ్ పేజీలను నిర్వహించింది. బీజేపీ మతతత్వ ప్రసంగాలకు కౌంటర్, షేర్​కార్డులతో నయా యూత్​కు చేరువైంది. దీంతో కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించగలిగింది.

కమీషన్లు, అవినీతి ఆరోపణలు
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై ఉన్న విమర్శలు, కమీషన్ల బాగోతాలు రాష్ట్రంలోనూ ఉన్నాయి. స్వయంగా సీఎం కేసీఆరే ఈ విషయం ఒప్పుకున్నారు. తమ పార్టీలో దళితబంధు కమీషన్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేలను హెచ్చరించారు. సీఎం దృష్టికి వచ్చినవి కొన్నే. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలపై కమీషన్ల ఆరోపణలు కోకొల్లలు. మంత్రులు కూడా వాటాలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా భూముల అమ్మకాలు, ప్రయివేట్​వ్యక్తులకు భూములు, టెండర్లలో గోల్​మాల్ వంటి విమర్శలు కూడా చాలా ఉన్నాయి. టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి చాలా అంశాలను ఆర్టీఐ ద్వారా సేకరించారు. వీటన్నింటినీ ప్రజలలోకి తీసుకెళ్తే, కన్నడ లాంటి తీర్పు రాష్ట్రంలోనూ వస్తుందనే ఆశిస్తున్నారు. 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో మరో నాలుగు నెలలలో ఎన్నికల పర్వం మొదలు కానుంది. ఇప్పటికే పార్టీలన్నీ ఓట్ల వేటలో పడ్డాయి. ఇలాంటి సమయంలో కర్ణాటక ఎన్నికలు రాష్ట్రంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కాంగ్రెస్​గెలుపుతో అధికార పార్టీ అప్రమత్తమవుతున్నది. కన్నడ ఫలితాల నుంచి ఇంకా బీజేపీ తేరుకోవడం లేదు. ఇప్పటికే బీజేపీలో చేరినవారు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్​ స్పీడ్​ పెంచింది. ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ టీమ్ మళ్లీ రంగంలోకి దిగింది. కర్ణాటకలో సునీల్ బృందం వ్యూహాలు వర్కౌట్ కావడంతో ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేసేందుకు కసరత్తు మొదలైంది. అయితే, కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలు మాత్రమే ఇక్కడ సరిపోవని భావిస్తున్నారు. మరింత గట్టి ప్రయత్నాలు చేసేందుకు పిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులు, విద్యావంతుల మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి. బీజేపీ నిరుద్యోగ మార్చ్​నిర్వహిస్తుంటే, కాంగ్రెస్ నిరుద్యోగ దీక్షలను చేపడుతున్నది. కీలక సమయంలో ప్రియాంకాగాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చి ‘యువ సంఘర్షణ’ సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, యూత్​ డిక్లరేషన్​ను ప్రకటించింది. 

 అయితే, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్​ విఫలమవుతోందనే అపవాదు ఉంది. ఇవన్నీ హస్తానికి లాభం చేయాలంటూ ముందుగా నేతలను ఏకం చేసేందుకు సునీల్​ టీమ్ ప్రయత్నిస్తున్నా అంతగా సఫలం కావడం లేదు. 

కాంగ్రెస్ ను లైట్​గా తీసుకున్న కేసీఆర్​
నిజానికి గడిచిన రెండేండ్ల నుంచి కాంగ్రెస్​ను అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ టార్గెట్ చేశాయి.​రెండోసారి అధికారంలోకి వచ్చీరాగానే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గులాబీ కండువా కప్పి, సీఎల్పీని టీఆర్ఎస్​ఎల్పీలో విలీనం చేశారు. దీంతో ‘కాంగ్రెస్​కు ఓటేస్తే అది బీఆర్ఎస్ ఖాతాలోకే’ అనే అభిప్రాయం ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే బీజేపీ ఊపు మీదకు వచ్చింది. దుబ్బాక, హుజురాబాద్​ ఉప ఎన్నికలలో గెలుపుతో ఆ పార్టీకి పగ్గాలు లేకుండా పోయాయి. ఈ పరిణామాలు తమకు మంచివేనని బీఆర్ఎస్ భావించింది. కాంగ్రెస్​కు క్షేత్రస్థాయి నుంచి జోష్​ వస్తే కష్టం కానీ, బీజేపీకి వస్తే ఏం కాదనే తీరుతో వ్యవహరించింది. ఇటీవల బీజేపీని కూడా అధికార పార్టీ ఇరకాటంలో పడేస్తున్నది. కానీ, కాంగ్రెస్​ఇంకా గ్రామస్థాయిలో బలంగా ఉందని బీఆర్ఎస్ అధినేత గుర్తించారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్​టార్గెట్ గా వ్యూహం మార్చుతున్నట్లు సమాచారం. 

హామీలు రిపీట్​
కర్ణాటకలో కాంగ్రెస్​ను హామీలు కూడా అధికారాన్ని అప్పజెప్పాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి వంటి ఐదు హామీలను అమలు చేస్తామని ఎన్నికలకు చాలా రోజుల ముందే కాంగ్రెస్‌ ప్రకటించింది. అధికారంలోకి వస్తే 'గృహజ్యోతి' పథకం ద్వారా 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు 'గృహలక్ష్మి' పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళా పెద్దకు ప్రతి నెల రూ. రెండు వేలు అందజేస్తామన్నారు. 'అన్న భాగ్య యోజన' పేరుతో ప్రతి కుటుంబానికి సది కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగులకు నెల నెలా రూ. మూడు వేల భృతి ఇస్తామని ప్రకటించారు. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రోజే వీటి అమలుపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మేనిఫెస్టో విడుదల సమయంలోనూ అనేక హామీలు కురిపించారు. మత్స్యకారులకు యేటా పన్ను రహితంగా 500 లీటర్ల డీజిల్ పంపిణీ చేస్తామన్నారు. ఉద్యోగులకు లీన్ పీరియడ్లో రూ. ఆరు వేరు అలవెన్స్ ఇస్తామన్నారు. వీటితోపాటుగా రాష్ట్ర ప్రజలలో బీజేపీ సర్కారు పట్ల ఉన్న వ్యతిరేకతను బాగా ఉపయోగించుకున్నారు.

మరి ఇక్కడెలా?
కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలలో వ్యతిరేకత ఎక్కువైంది. అది పలు సందర్భాలలో బయట పడింది. కానీ, మన రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీపై భారీ స్థాయిలో అసంతృప్తి ఉన్నప్పటికీ, అది బయటకు రావడం లేదు. ప్రజలలో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చుతామని సీఎం కేసీఆర్ ముందు నుంచే సంకేతాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నడ హామీలను యధాతథంగా మేనిఫెస్టోలో పెడితే ఇక్కడ వర్కౌట్ కాదని కాంగ్రెస్​వ్యూహకర్త టీమ్ భావిస్తున్నది. ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గాలకు దగ్గరయ్యేందుకు రైతు డిక్లరేషన్, యూత్​ డిక్లరేషన్​, బీసీ డిక్లరేషన్, మైనార్టీ డిక్లరేషన్ అంటూ కొన్ని స్కీములను తెరపైకి తీసుకువస్తుంది. రుణమాఫీని​అందిపుచ్చుకోవాలని చూస్తున్నది. 

ఐటీ సెక్టార్​పై గురి
ఐటీ రంగంలో చాలా పురోగతి సాధిస్తున్నామంటూ కేసీఆర్​ సర్కారు చెబుతూ వస్తున్నది. మంత్రి కేటీఆర్​చేతిలో ఉన్న ఈ శాఖ ఇప్పటికే లక్షల ఉద్యోగాలు అంటున్నదిది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం నిరుద్యోగం పెరుగుతూనే ఉన్నది. ఐటీ కంపెనీలు వస్తున్నా అవి సరిగా నిలదొక్కుకోవడం లేదు. వాటికి ఆర్థికపరంగా ప్రభుత్వం నుంచి వచ్చే సాయం కూడా తక్కువేననే అభిప్రాయాలున్నాయి. కన్నడ నాట ఎన్నికలలో బెంగళూరును సెంటర్​గా చేసుకుని, ఐటీ రంగాన్ని సునీల్ టీమ్ తమవైపు తిప్పుకున్నది. దీనికి సోషల్ మీడియాను ప్రధానంగా వాడుకున్నది. 

ఇక్కడి నుంచే మంత్రాంగం
కన్నడ ఎన్నికలకు సునీల్ టీమ్ హైదరాబాద్​ను కేంద్రంగా చేసుకున్నది. ఇక్కడి నుంచే సోషల్ మీడియా, మీడియా, ప్రచార వింగ్​ను వాడుకున్నది. నేతల స్పీచ్​కూడా ఇక్కడే సిద్ధమైంది. వాటిని కర్ణాటకలో ప్రచారం చేసేందుకు కూడా హైదరాబాద్ ను​ సెంటర్​ పాయింట్​గానే చేసుకున్నారు. వందలాది వెబ్​ పేజీలు తయారు చేశారు. యూట్యూబ్​ చానళ్లు, వీడియోలను కన్నడ ప్రజలు, ఓటర్లలోకి తీసుకెళ్లారు. ఈ సక్సెస్​ వ్యూహాన్ని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేసేందుకు సునీల్ టీమ్ ప్రత్యేక ఫార్మాట్​ను సిద్ధం చేసుకున్నది.

Epaper: Click here for Daily News

కన్నడ తంత్ర.. సునీల్ మంత్ర: Click here