భూపాలపల్లి గులాబీలో టికెట్ ఎవరికో..? - నేతలు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్..

భూపాలపల్లి గులాబీలో టికెట్ ఎవరికో..? - నేతలు, కార్యకర్తల్లో టెన్షన్.. టెన్షన్..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలోని గులాబీలో టికెట్ ఎవరిని వరిస్తుందోననే టెన్షన్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో రోజురోజుకు పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీగా ఉన్న సిరికొండ మధుసూదనాచారిలు భూపాలపల్లి టికెట్ పై ఆశలు పెట్టుకుని వర్గాలుగా పర్యటనలు చేస్తున్నారు. ఈసారి టికెట్ వస్తే ఎలాగైనా గెలుపొంది, మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇరువురు నేతలు తమదైన శైలిలో నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఇరువురు నేతలు ఎవరికి వారుగా పర్యటనలు చేస్తుండడంతో క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఇద్దరిలో టికెట్ ఎవరికి వస్తుందో.. ఎవరికి సపోర్టుగా ఉండాలో.. అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి టికెట్ వస్తుందా.. రాదా.. అనేది సందిగ్ధంగా మారింది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి మంత్రి కేటీఆర్ అండదండలు పుష్కలంగా ఉన్నాయని సంకేతాలు ఉన్నప్పటికీ, సిరికొండ మధుసూదనాచారికి కూడా సీఎం కేసీఆర్ అండదండలు అదే స్థాయిలో ఉండడంతో నువ్వా, నేనా తేల్చుకుందాం అనే స్థాయిలో పట్టు పెంచుకుంటున్నారు. నియోజకవర్గంలోని గులాబీలో హేమహేమీలుగా ఉన్న ఇరువురిలో టికెట్ ఎవరిని వరిస్తుందోననే ఉత్కంఠ రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతుంది.