ఓవర్ టు ఢిల్లీ.. ఢిల్లీలో టెన్షన్.. నియోజకవర్గాల్లో హై టెన్షన్..

ఓవర్ టు ఢిల్లీ..  ఢిల్లీలో టెన్షన్.. నియోజకవర్గాల్లో హై టెన్షన్..
  • తమ నాయకులకు టికెట్ వస్తుందా రాదా అన్న సందిగ్ధంలో కాంగ్రెస్ క్యాడర్
  • టికెట్ ఆశావాహుల ఎదురుచూపులు ఇంకో వారం పట్టేనా
  • కొలిక్కిరాని కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక
  • ఇంకా వారం తప్పదా తలనొప్పి ఇంక
  • సర్వే కీలకమా ఫైరవీ ప్రాధాన్యమా కర్ణాటక ఫార్ములానా 
  • గాడ్ ఫాదర్ ల  ప్రసన్నం పైరవీల కోసం ఢిల్లీ బాట పట్టిన ఆశావాహులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: మరో వారం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఇంకా అభ్యర్థుల ఎంపిక మాత్రం ఒక కొలిక్కి రాలేదు. టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు తమ తమ గాడ్ ఫాదర్లను నమ్ముకొని ఢిల్లీ బాట పట్టారు ఢిల్లీలో టికెట్ల విషయంలో టెన్షన్ నెలకొని ఉండగా ఆయా నియోజకవర్గాల్లో నాయకుల అనుచర వర్గంలో హై టెన్షన్ నెలకొని ఉంది. అభ్యర్థులు నిర్ణయించి అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ ఇంకా టికెట్లు ఒక కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ క్యాడర్లో ఒక రకమైన అయోమయం నెలకొని ఉంది. దీనికి తోడు ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్లు అన్న విషయంలో కూడా కాంగ్రెస్ వార్  రూమ్ లో చర్చలు వాదోపవాదాలు వేడివేడిగా కొనసాగుతున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమకే కాకుండా తమను నమ్మిన వారికి తమ అనుచర గణానికి టికెట్లు ఇప్పించుకోవడానికి ఢిల్లీలో పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుందనేది జగమెరిగిన సత్యం.

సూర్యాపేట పై వీడని పీఠముడి

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టికెట్ ఆశిస్తున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ల మధ్యన టికెట్ కోసం వార్ జోరుగా సాగుతుంది జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గ నుండి టి పి సి సి మాజీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గం నుండి ఆయన సతీమణి పద్మావతి రెడ్డి పోటీలో ఉంటారని దాదాపు నిర్ణయం జరిగింది వార్తలు వెలువడుతున్నాయి తుంగతుర్తి ఎస్సి రిజర్వుడు నియోజకవర్గ నుంచి 23 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లు తమ అనుచరులకు టికెట్ ఇప్పించుకోవడానికి జోరుగా పైరవీలు చేస్తున్నట్టు సమాచారం.

జిల్లా వ్యాప్తంగా తమకే టికెట్ అనే ధీమాలో ఆశావాహులు

మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కూడా తన ఇద్దరి కుమారులను ఎన్నికల బరిలో నిలపడానికి సమాయత్తం కావడంతోపాటు రెండు టికెట్లు ఇవ్వని పక్షంలో తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి సంసిద్ధులుగా ఉన్నట్టు తెలుస్తుంది. నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎలాంటి పోటీ లేనప్పటికీ దేవరకొండ మునుగోడు ఆలేరు భువనగిరి నకరేకల్ లో తీవ్ర పోటీ నెలకొని ఉండడం తన అనుచరులకే టికెట్ దక్కేలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రణాళికలు వేయడం పావులు కలపడం చేస్తున్నారు అయితే తాజాగా కాంగ్రెస్ కండువా కప్పుకొని మాజీ ఎమ్మెల్యే వీరేశం నకిరేకల్ నుండి పోటీ చేయడానికి మార్గం సుగమం అయినట్టు సమాచారం.

సర్వే కీలకమా పైరవీ ప్రాధాన్యమా, కర్ణాటక ఫార్ములా నా

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏ పద్ధతులను సూత్రాలను సిద్ధాంతాలను పరిగణలోనికి తీసుకొని టికెట్లు కేటాయిస్తారో అన్న పీఠముడి స్పష్టంగా వీడడం లేదు. అధిష్టానం తెలంగాణ వ్యాప్తంగా నాలుగుసార్లు వివిధ ఏజెన్సీల ద్వారా రహస్య సర్వే జరిపిన ప్రకారం దీనికి తోడు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే ప్రకారం టికెట్ల ఎంపిక ఉంటుందని బహిరంగంగా ప్రకటించినప్పటికీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు మాత్రం తమ తమ గాడ్ ఫాదర్ లను నమ్ముకొని ఢిల్లీ బాట బట్టి ఫైరవీలతో టికెట్ల వేటలో మునిగి తేలుతున్నారు దీనికి తోడు కర్ణాటకలో అభ్యర్థులను ఎంపిక చేసిన సూత్రాన్ని తెలంగాణలో కూడా ఆచరణలో  పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ముద్ర ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు ఏది ఏమైనా గెలుపు గుర్రాలను ఆచితూచి అన్ని రకాలుగా చూచి ఎంపిక చేయడం జరుగుతుందని సదరు సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.

ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న అభ్యర్థులను ఎంపిక చేయరా

మరో వారం పది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అంతా సిద్ధం చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాకపోవడంపై కాంగ్రెస్ సెకండ్ కేడర్ కార్యకర్తల్లో అయోమయం సందిగ్ధం నెలకొంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరుగా దూసుకెళ్తుండటం టికెట్లు డిసైడ్ కాక కాంగ్రెస్ సందిగ్ధంలో ఉండడం ఆ పార్టీ క్యాడర్ను కొంత కలవర పెడుతున్న మాట వాస్తవమే అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా తొలి దశ అభ్యర్థుల ఎంపికకు వారం పది రోజులు పట్టేలా ఉందని కాంగ్రెస్ సీనియర్లు టిపిసిసి చీఫ్ రేవంత్ ల మధ్యన ఇంకా కొలిక్కి రాకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అవుతుందని పలువురు కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు ఉత్తంకుమార్ రెడ్డి వెంకట్ రెడ్డిలు ఉండటం వలన టిపిసిసి చీఫ్ రేవంత్ తో ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడానికి ఒక కారణంగా పలువురు పేర్కొంటున్నారు. దీనికి తోడు ఇటీవల పార్టీలో చేరిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు టికెట్లు అడుగుతుండడం బీసీ వాటా తేల్చాలని కొందరు పట్టుబడుతుండడం మహిళలు కూడా తమకు కొన్ని టికెట్లు కేటాయించాలని విద్యార్థి యువజన విభాగాల వారు కూడా టికెట్లు కావాలని కోరడం కమ్యూనిస్టుల పొత్తు నేపథ్యంలో సీట్ల ఎంపికలు కొలిక్కి రాకపోవడం ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఆలస్యం కావడానికి సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా నాయకులు కొంచెం పట్టు విడుపులు పాటించి టికెట్లు త్వరగా కేటాయించి సస్పెన్స్కు తెరదించి ఎన్నికల బరిలో ప్రచార పర్వంలో దూసుకుపోవాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటుంది. ఆ దిశగా కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని మనమూ ఆశిద్దాం