మోత్కూర్ లో దొంగల హల్ చల్

మోత్కూర్ లో దొంగల హల్ చల్

-నిద్రిస్తున్న మహిళ మెడలోంచి నాలుగు తులాల పుస్తెలతాడు చోరీ.
-వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు
మోత్కూర్, ముద్ర:మోత్కూర్ పట్టణంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతుండడంతో ప్రజలు  భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ కేంద్రంలో రెండు రోజుల క్రితమే మిట్ట మధ్యాహ్నం ఓ ఇంటి తలుపు తళాలు పగలగొట్టి రూ.లక్ష విలువైన నగదు, సొమ్ములు ఎత్తుకెళ్లిన దొంగలు.. తాజాగా నిద్రిస్తున్న మహిళ మెడలోంచి రూ.2.68లక్షల విలువైన 4 తులాల బంగారు పుస్తెలతాడు దొంగిలించారు. మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ లో పూల వ్యాపారి గంగారాం చంద్రయ్య(పూల చంద్రయ్య) భార్య యాదమ్మ ఆదివారం మధ్యాహ్నం షాపులో నిద్రిస్తున్నది. ఆ సమయంలో పూల కోసమని ముగ్గురు గుర్తు తెలియని మహిళలు వచ్చి వెళ్లారని చెబుతుండగా, రాత్రి ఇంటికి వెళ్లిన తర్వాత మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడు కనిపించలేదని తెలిపింది. సోమవారం  బాధితురాలు యాదమ్మ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆదివారం మధ్యాహ్నం తాను షాపులో నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని మహిళలు వచ్చారని, తాను లేచే లోగానే వెళ్లిపోయారని, వాళ్లు వచ్చిన సమయంలోనే తన పుస్తెల తాడు దొంగతనం జరిగిందని తెలిపింది. దొంగలు తమ ఆచూకీ, ఆధారాలు దొరకకుండా చోరీలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. వరుస దొంగతనాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.