ప్రతి చిన్నారికి నులిపురుగు మాత్రలు వేయాలి: జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష 

ప్రతి చిన్నారికి నులిపురుగు మాత్రలు వేయాలి: జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ భాష 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పకడ్బంధీగా ప్రతీ చిన్నారికి అందేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. ఈ నెల 20  న జాతీయ నులి పురుగు దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి సమన్వయ  కమిటి సమావేశం  శనివారం రోజున సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రక్త హీనత, పోషక ఆహార లోపం, తదితర సమస్యలతో చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 20 న జిల్లాలోని  1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరికీ  అల్బెండాజోల్ మాత్రను డాక్టర్ల సలహా మేరకు తినిపించాలని అన్నారు.

1 నుండి 5  సంవత్సరాలలోపు  అంగన్ వాడీ కేంద్రాలలోని 68,573  మంది చిన్నారులకు, 6  నుండి 16 సంవత్సరాల వయస్సు గల 1,49,570 మంది పాఠశాలల విద్యార్థులకు,  16 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 21,098 మంది  జూనియర్ కళాశాలల విద్యార్థులకు, 1638 వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులకు, 9285 మంది బడి బయట ఉన్న పిల్లలకు అల్బెండాజోల్ మాత్రను ఆయా యాజమాన్యం, అధికారులు స్వయంగా అందజేసి వారి ముందే భోజనం అనంతరం తినిపించాలని    తెలిపారు. 

జిల్లా వ్యాప్తంగా 2,50,152 మంది పిల్లలకు ఆశా, అంగన్ వాడీ, పాఠశాలల, కళాశాలల యాజమాన్యం బాధ్యతగా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో, సంబంధిత శాఖల సంక్షేమ అధికారులు, మున్సిపల్, పంచాయతి, సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధుల, స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యంతో అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభించి కొనసాగించాలని అన్నారు. ఈ నెల 20 న అల్బెండాజోల్ మాత్రను వేసుకోని వారు 27 వ తేదిన తప్పనిసరిగా మాత్రను వేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్ వాడీ కేంద్రాలలోని 1-2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను, 2-3 సంవత్సరాల చిన్నారులకు పూర్తీ మాత్రను, 3-19 సంవత్సరాల పిల్లలు మాత్రను నమిలి మింగేలా ప్రయోగాత్మకంగా తెలియజేయాలని అన్నారు. ఈ మాత్ర వలన ఎలాంటి సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. 

గ్రామాలు, పట్టణాల్లో టాం టాం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని, మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారి పిల్లలకు మాత్రను తప్పనిసరిగా వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. సంక్షేమ శాఖ అధికారులు వారి ఆధీనంలోని పాఠశాలలు, వసతి గృహలలోని పిల్లలందరికీ మాత్రలు అందించే విధంగా ముందస్తు ఏర్పాట్లు  చేయాలని అన్నారు. అంతకు ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ కార్యక్రమం  నిర్వహణపై వివరించారు.ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి లక్ష్మి నారాయణ, సంక్షేమ శాఖ అధికారులు సాయిబాబా, రాజ్ కుమార్, జనార్ధన్, జిల్లా పంచాయతి అధికారి దేవరాజ్, మున్సిపల్ కమిషనర్లు,వివిధ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ప్రతినిధులు, అధికారులు, వైద్య శాఖ సిబ్బంది, తదితరులు   పాల్గొన్నారు.