మంత్రి హరీష్ రావు అసహనం.. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును బయటపెట్టింది

మంత్రి హరీష్ రావు అసహనం.. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును బయటపెట్టింది
  • స్థానిక ఎమ్మెల్యే కు సమాచారం ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం
  •  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.భోగ శ్రావణి 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సమాచారం ఇవ్వకుండా నేరుగా ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సందర్శించడం అంటే ఎమ్మెల్యే పైన మంత్రికి ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుందని జగిత్యాల మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి విమర్శించారు. శ్రావణి విలేకరులతో మాట్లాడుతూ  ప్రజల ప్రాణాలు అంటే డాక్టర్లకు, ఆ డాక్టర్లకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యే కు లెక్కలేదని అన్నారు.

జగిత్యాలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వస్తున్నారని తెలిసి కూడా డాక్టర్లు అందుబాటులో లేరంటే వారికి ప్రజల ప్రాణాలు అంటే ఎంత విలువ ఉందో అర్థం అవుతుందని చెప్పారు. ఆరోగ్య శాఖామంత్రి గంటన్నర పాటు ఆసుపత్రి కలియతిరిగి సమస్యలను చూసి కంగుతిన్నారని  మీడియాతో మాట్లాడటానికి కూడా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఇష్టపడలేదంటే ఆసుపత్రి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందని అన్నారు. 

కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ కు ఉన్న సమాచారం స్థానిక ఎమ్మెల్యేకు ఎందుకు లేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కు చెప్తే ఆయన స్థానిక డ్యూటీ డాక్టర్లకు సమాచారం చేరవేస్తారని వాస్తవ పరిస్థితులను ఆరోగ్య శాఖ మంత్రికి తెలియకుండా దాస్తారన్న అనుమానంతోనే ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదని శ్రావణి ఆరోపించారు. కనీసం ఈ మూడు నెలలు అయిన ప్రజారోగ్యం పైన ఒక డాక్టర్ గా ఎమ్మెల్యే  దృష్టి పెట్టాలని శ్రావణి డిమాండ్ చేశారు.