పక్షం రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు : అదనపు కలెక్టర్

పక్షం రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు : అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: ఏప్రిల్20 తర్వాత జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం రైస్ మిల్లుల యజమానులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. యాసంగిలో మిల్లింగ్ చేసే రైస్ మిల్లుల వివరాలను రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా పౌరసరఫరాల శాఖకు తెలియజేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు శుభ్రపరచిన ధాన్యాన్ని తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు చూడాలని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల కోసం గన్ని బ్యాగులు, టార్పాలినలను సిద్ధం చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యంతో పాటు ఆధార్ కార్డు,  పాసుపుస్తకం, బ్యాంక్ అకౌంట్ నకలు తీసుకువచ్చే విధంగా చూడాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో వాణి, డిఎస్ఓ పద్మ, జిల్లా సహకార అధికారిని వసంత, జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కంచర్ల లింగం, ప్రతినిధులు పాల్గొన్నారు.