భక్తితోనే మనిషికి సన్మార్గం

భక్తితోనే మనిషికి సన్మార్గం
  • నేటి తరంలో కొరవడుతున్న అధ్యాత్మికత
  • 7వ తేదీన  10 వేల మందితో భారీ శోభయాత్ర
  • రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :భక్తి ఉన్నప్పుడే భయం ఉంటుందని భయం ఉన్నప్పుడే మనిషి క్రమశిక్షణతో సన్మార్గంలో పయనిస్తాడనీ బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ ఆలయ నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి గంగుల సోమవారం పరిశీలించారు. ఆలయ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది. మిగత ఏమేమి కట్టడాలు వస్తాయంటూ ఆరా తీశారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషికి దేవుడి పై భక్తి ఉన్నప్పుడే భయం ఉంటుందని తద్వార సమాజం సన్మార్గంలో పయనిస్తుందన్నారు. నేటి తరంలో అధ్యాత్మికత కొరవడిందని, భక్తిని పెంపొందించేందుకే ఓ వైపు టిటిడి ఆలయం మరోవైపు ఇస్కాన్ ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు.

మానవ జన్మ ఎత్తినందుకు మాధవ సేవ చేసుకునేందుకు నగరంలో టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయం,  ఇస్కాన్ ఆధ్వర్యంలో కృష్ణుడి ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే ఇస్కాన్ ఆలయ నిర్మాణం కోసం 3 ఎకరాల స్థలంతో పాటు 20 కోట్లు కెటాయించామన్నారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పూర్తి చేసి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ పనులు మొదలు పెడుతామన్నారు. ఆలయ నిర్మాణ విషయం ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఈ నెల 7వ తేదీన సాయంత్రం 4 గంటలకు 10 వేల మందితో భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ చౌక్ నుండి ప్రారంభమయ్యే ఈ శోభాయాత్రలో ఆధ్మాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతామన్నారు. క్రిష్ణ భగవానుడే స్వయంగా కరీంనగర్ కు వస్తున్నందునా కరీంనగర్ వాసులు 10 వేల మందికి తగ్గకుండా తరలిరావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ప్రజలను చల్లగా చూడాలని క్రిష్ణ భగవానున్ని ప్రార్తిస్తున్న అన్నారు. ఇస్కాన్ టెంపుల్ కు మానేరు రివర్ ఫ్రంట్ ప్రధాన ఆకర్షణగా నిలువనుందన్నారు. ఈ సందర్భంగా స్థలానికి సంబంధించిన కేటాయింపు జీవో కాపీలను ఆలయ నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి - హరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.