కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడిస్తా

కరీంనగర్ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడిస్తా
  • కాంగ్రెస్ వి వారంటీలేని గ్యారెంటీలు 
  • పదేళ్ళలో తెలంగాణను అగ్రగామిగా నిలిపాం
  • వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఘనత కేసీఆర్ దే
  • కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్

ముద్ర,చొప్పదండి:రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్‌ఎస్‌ పార్టీ సత్తాను చాటేందుకు పార్టీ నాయకులు,కార్యకర్తలు సమాయత్తం కావాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. గంగాధర మండలకేంద్రంలో చొప్పదండి నియోజకవర్గం స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం శనివారం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించగా ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో వారు వేర్వేరుగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి 7వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడం విడ్డూరంగా ఉందని,వీటితో పాటు గతంలో 40వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. కోర్టుల్లో కేసుల ద్వారా నియామకాలు జరుగలేదనీ, మరో 32వేల ఖాళీలను కూడా గుర్తించడం జరిగిందన్నారు.

కాంగ్రెస్ సర్కారుకు దమ్ముంటే ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను గుర్తించి 2లక్షల ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రం రాక ముందు 7778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే కేసీఆర్ సీఎం అయిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం చేసి 26వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో అగ్రగామిగా నిలిచిందని, తాము పదేళ్ళలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేదని కానీ కాంగ్రెస్, బీజేపీ లు ప్రజలకు అబద్దాలు చెప్పి మోసం చేశారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిదీలో గత ఐదేళ్ల కాలంలో ఎంపీ బండి సంజయ్ నయాపైసా అభివృద్ధి చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.