ఉద్యోగాలిస్తామని మోదీ, కెసిఆర్, మోసం

ఉద్యోగాలిస్తామని మోదీ, కెసిఆర్, మోసం

 కాంగ్రెస్ ఉద్యోగ భర్తీ గ్యారంటీ

ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే

ముద్ర ప్రతినిధి, మెదక్: ఉద్యోగాలిస్తామని మోదీ, కెసిఆర్, మోసం చేశారు.... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ భర్తీ గ్యారంటీ అని ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హామీ ఇచ్చారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిన్న గొట్టిముక్ల లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ కెసిఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని ఖర్గే ధ్వజమెత్తారు. తెలంగాణకు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్, దళితుల ఓట్లను కొల్లగొట్టాడన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ అసెంబ్లీలో నేను ఉద్యోగం ఇస్తానని అనలేదని అబద్ధం ఆడాడన్నారు. ముఖ్యమంత్రి కాకముందు పోడు భూములకు పట్టా ఇస్తా అని ఇప్పటివరకు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశాడన్నారు. కెసిఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంది, ఒఆర్ఆర్, కాలేశ్వరం ప్రాజెక్ట్, డబల్ బెడ్ రూమ్, ధరణి తదితర ప్రాజెక్టుల పేరా లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 2014 సంవత్సరం ముందు మిగులు బడ్జెట్, కెసిఆర్ వచ్చాక 5,60 వేల కోట్లు అప్పు చేశాడన్నారు.

ఇందిరమ్మను దూషించిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిదన్నారు. దళిత బందు, గృహలక్ష్మి, వృద్ధాప్య పింఛన్, డబల్ బెడ్ రూమ్, హామీలు నేర్పించడానికి కెసిఆర్ దగ్గర డబ్బులు లేవన్నారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసి రాహుల్ గాంధీ అందరినీ కలిశాడు. కెసిఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడన్నారు. కేసీఆర్ లిక్కర్, మైనింగ్ మాఫియాలని మాత్రమే కలుస్తాడన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రైతుబంధు పథకాన్ని నిలిపివేయమని తెలపగా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఆపిందని ఆరోపణ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. మహాలక్ష్మి, గ్యాస్ సిలిండర్, మహిళల బస్సు ఉచిత సౌకర్యం, భూమిలేని కౌలు రైతులకు సైతం 15 వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు,10 లక్షల ఆరోగ్యశ్రీ యోజన, 5 లక్షలు విద్యార్థుల చదువులకై కేటాయిస్తుందన్నారు. నర్సాపూర్ లో ఆవుల రాజిరెడ్డిని గెలిపించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.