అచ్చంపేట నల్లమల్లలో గువ్వల శకం ముగిసింది

అచ్చంపేట నల్లమల్లలో గువ్వల శకం ముగిసింది
  • ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం కేసీఆర్
  • తెలంగాణలో కెసిఆర్  ఖేల్ కతం దుకాణ్ బంద్
  • ప్రాజెక్టుల పేరుతో మరో మారు నల్లమల్ల ప్రజలను మోసం చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ
  • అచ్చంపేట మీడియా సమావేశంలో డిసిసి అధ్యక్షులు అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

ముద్ర,అచ్చంపేట:అబద్ధపు మాటలతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం కేసీఆర్ పై నాగర్ కర్నూలు డిసిసి అధ్యక్షులు అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేట పట్టణంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2017 లో మంత్రి హరీష్ రావు వచ్చిన సందర్భంగా అమ్రాబాద్ మండలానికి ఎత్తిపోతల ద్వారా సాగునీటిని అందిస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఐదేళ్లు గడిచిన ప్రాజెక్టులకు అధిపతి లేదని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ మాయమాటలతో తెలంగాణ ప్రజలను పదేళ్లుగా మోసం చేస్తూనే వచ్చిందని వారి మాటలు వినే స్థితిలో తెలంగాణ ప్రజలు ప్రస్తుతం లేరని వారికి ఈ 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కేల్ కతం దుకాణ్ బంద్ కావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. స్థానికేతరడైన గువ్వల బాలరాజును అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కనీసం అభివృద్ధి పనులపై శ్రద్ధ పెట్టకుండా ఈ ప్రాంత ప్రజలను, అధికారులను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీ కె ఎల్ ఐ పథకం ద్వారా కాలువలు తవ్వితే ఆ కాల్వల్లో నీటిని వదిలి తామే ప్రాజెక్టు నిర్మించామని గొప్పలు చెప్పుకున్న నీచరిత్ర బిఆర్ఎస్ పార్టీదని ఆయన ఘాటుగా విమర్శించారు. అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో లెక్కలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేయవలసిన గువ్వల బాలరాజు నల్లమల్ల ప్రాంతంలోని పురాతనమైన గుళ్లను తవ్వి గుప్తనిధులను కాజేశాడని ఆయన ఆరోపించారు. నల్లమల్ల ప్రజలకు ఆయన చేసిన మేలు ఏమిటో ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. బిఆర్ఎస్ పదేండ్ల కాలంలో అచ్చంపేట ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలో జరిగిన సీఎం కేసీఆర్  ఎన్నికల సభలో అన్ని అబద్ధపు మాటలు మాట్లాడి అచ్చంపేట నల్లమల్ల ప్రజలను మరో మరో మోసం చేసేందుకు మాయమాటలు చెప్పి వెళ్లారని వారి మాటలను నల్లమల్ల ప్రజలు వినే స్థితిలో లేరని ఇక అచ్చంపేట నల్లమల లో బిఆర్ఎస్ పార్టీ కథ ముగిసిందని  డిసెంబర్ 3న అదే జరుగుతుందని ఆయన అన్నారు.

ఇక గువ్వల బాలరాజు అచ్చంపేట ను వదిలి ఆయన సొంత జిల్లా వనపర్తి జిల్లా పిలికెపాడుకు  వెళ్ళక తప్పదని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు ఎంతో సహనం ఓర్పుతో పదేళ్లపాటు గువ్వల బాలరాజు అరాచకాలను భరించారని ఇక భరించే స్థితిలో ప్రజలు లేరని నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో గువ్వల బాలరాజు పరాజయం పాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. నల్లమల్ల ప్రజలను ప్రాజెక్టుల పేరుతో బూటకు హామీలను ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని వారి మాటలకు కాలం చెల్లిందని అన్నారు. నియోజవర్గంలో బిఆర్ఎస్ పార్టీ కి బీటలు వారాయని ఏ గ్రామానికి వెళ్లిన బిఆర్ఎస్  పార్టీని వీడి నాయకులు కార్యకర్తలు తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. అచ్చంపేట నల్లమల్ల ప్రజలు ఆత్మగౌరవంతో ముందుకు వెళుతున్నారని రౌడీయిజాన్ని కోరుకోవడం లేదని అన్నారు. గువ్వల బాలరాజు కు ప్రజలలో ప్రజాదరణ లేదని సీఎం కేసీఆర్ వచ్చిన సభకే వచ్చిన జనాన్ని చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. అచ్చంపేట తో పాటు రాష్ట్రంలో 90 నుంచి 100 వరకు ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేందర్ అడ్వకేట్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గార్లపాటి శ్రీనివాస్, కౌన్సిలర్ గౌరీ శంకర్ ,జెడ్పిటిసి మంత్రియా నాయక్, మాజీ మార్కెట్ చైర్మన్ మేరే శ్రీనివాసులు, డిసిసి ఉపాధ్యక్షులు కాశన్న యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చరణ్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.