బీజేపీ పంచన చేరిన బీఆర్‌ఎస్‌

బీజేపీ పంచన చేరిన బీఆర్‌ఎస్‌
  • సమ్మె చేస్తున్నవారిపై నిర్బంధాలు
  • ఎర్రజెండా నేతలపై ఉక్కు‌పాదం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :బీజేపీని విమర్శించిన బీఆర్‌ఎస్‌ తన వైఖరి మార్చుకుని బీజేపీ పంచన చేరినట్టుగా కనిపిస్తోందని, బీజేపీని సంతృప్తి పరిచే చర్యలకు కెసిఆర్ కోరుకుంటున్నాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రా భవనంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సిపిఎం రాష్ట్ర కార్మికవర్గంపై నిరంకుశ పోకడను అవలంబిస్తోందని ఎన్నడూ చూడని విధంగా నిర్బంధాలకు దిగుతోందని మండిపడ్డారు. ప్రజలకు అండగా నిలిచిన ఎర్రజెండా నేతలను సంఘవిద్రోహశ‌క్తుల‌ మాదిరిగా కోర్టుల ద్వారా బహిష్కరణ వేటు వేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసామ్యబద్ధంగా చర్చలకు రాకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర బీఆర్‌ఎస్‌ సర్కారుకు ప్ర‌‌జ‌లే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి అన్నారు. మొన్నటివరకూ ప్ర‌‌ధాని మోడీపైనా, కేంద్రంలోని బీజేపీపైనా, ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలపైనా వ్యతిరేకంగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌ సర్కారు ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకున్నట్టుగా క‌నిపిస్తోంద‌న్నా‌రు. వంటగ్యాస్‌ మొదలు బియ్యం, పప్పులు, పెట్రో, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుడు బతకడమే కష్టంగా కేంద్రంలోని బీజేపీ త‌న  పాలన సాగిస్తోందన్నారు. పదేండ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా బలహీనవర్గాలపై దాడులు పెరగాయని సాక్ష్యాత్తు కేంద్ర ఎన్‌సీఆర్‌ లెక్కలే చెబుతున్నాయని వివరించారు. మండిపోతున్న మణిపూర్‌, మతకల్లోలాలతో అట్టుడుకుతున్న హర్యానా కండ్లెదుటే క‌నిపిస్తోంద‌ని తెలిపారు. రాజ్యంగపీఠికలో సోషలిజం, లౌకికతత్వం పదాలు తొలగించి మరీ బరితెగించిన మోడీ పాలనతీరు, దాని పరిణామాలను మొన్నటివరకూ ఎండగట్టిన రాష్ట్ర బీఆర్‌ఎస్‌ సర్కారు ఇప్పుడు చడీచప్పుడు చేయకుండా వారి పంచన చేరినట్టుగా కనిపిస్తోందన్నారు. పైగా కేంద్ర బీజేపీని సంతృప్తి పరిచేవిధంగా రాష్ట్ర కార్మికవర్గంపై నిర్బంధాన్ని  ప్రయోగించడం దారుణమన్నారు.కనీస వేతన సవరణను అటకెక్కించి,రాష్ట్రంలోని 73షెడ్యుల్‌ విభాగాల కింద ఉన్న కోటి మంది కార్మికుల కనీస వేతన చట్టం పుననిర్మాణం ఉమ్మడి రాష్ట్రం నుంచి 15 ఏండ్లుగా అటకెక్కిందని వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు, బడా పారిశ్రామిక వేత్తల పక్షానే ప్రభుత్వం నిలబడుతోందని, ఐదేండ్లకోమారు సవరణ చేయాల్సిన కనీసవేతనచట్టాన్ని‌ పట్టించుకోవడం లేదని విమర్శించారు.

గతంలో సమ్మె, ఇతరపోరాటాలు చేసిన స్కీంవర్కర్లు, పంచాయతీ కార్మికుల‌కు వారి డిమాండ్ల పరిష్కారానికి మాట ఇచ్చి మరిచిపోయింద‌న్నా‌రు.  పైగా సమ్మె చేసే రాజ్యంగహక్కు‌నూ కాలరాసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సమ్మె చేసే రంగంలోకి వేరే రంగంలోని ఉద్యోగ, కార్మికులను దింపే ప్రయత్నం చేస్తోందని,  రేపొద్దున తాము సమ్మె చేసినా ఇలాంటి పరిస్థితియే ఎదురవుతుందనే అవగాహన ఉన్న కార్మికులెవరూ ప్రభుత్వం మాట వినడం లేదని వివరించారు. ఒకవైపు అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే వారి కేంద్రాల తాళాలలను అధికారులతో పగళగొట్టించి మరీ దొంగలా వ్యవహరిస్తోందన్నారు. సమ్మె విరమించి అడుక్కుంటే సరి లేదంటే నిర్బంధం తప్పదని సూచిస్తున్న ముఖ్యమంత్రి తన దయాదాక్షిణ్యాలతో భిక్ష వేస్తున్నాడా? అని ప్రశ్నించారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్ల కోసం ఎదురుచూసి వేసారిన ఇల్లులేని నిరుపేదలు ప్రస్తుతం రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 66 కేంద్రాల్లో సుమారు లక్షకుపైగా మంది గుడిసెలు వేసుకుని 17 నెలలుగా భూపోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. హక్కు‌ల కోసం, కనీస వేతనాల కోసం సమ్మె చేస్తున్న వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని, అందులోభాగంగానే వారికి అండగా నిలిచిన ఆదిలాబాద్‌ జిల్లా సీపీఎం, సీఐటీయూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులను రిమాండ్‌ చేసిందని తెలిపారు. వాళ్లేమైనా రౌడీలా, సంఘవిద్రోహ శక్తులా అని ప్రశ్నించారు. ప్రజాపోరాటాల మీద ఉక్కు‌పాదం మోపిన వారు ఎవరూ నిలబడలేదని, కేంద్రంలాగానే నియంతృత్వ పోకడకలకు పోతే ప్రజలే బుద్ధి చెబుతారని వీరయ్య హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం  ఆయా రంగాల్లో యూనియన్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చలు జరిపి కార్మిక సమస్యలు పరిష్కరించాలని,  లేదంటే కార్మికపక్షాన‌ ఎర్రజెండాలే ప్రభుత్వాన్ని ఢీ కొంటాయని హెచ్చరించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గిట్ల ముకుంద రెడ్డి, గుడి కందుల సత్యం,జిల్లా కమిటీ సభ్యులు సుంకరి సంపత్‌, ఎడ్ల రమేష్‌లు పాల్గొన్నారు.