కుట్రలు చేసి టికెట్ రాకుండా చేశారు 

కుట్రలు చేసి టికెట్ రాకుండా చేశారు 
  • నామినేషన్ రోజే నా సగం ఆస్తి ప్రజలకు రాసిచ్చేస్తా 
  • బిజెపి పెద్దల్లారా నేను ఏం తప్పు చేశానో చెప్పండి..? 
  • బిజెపి నేత, పాలమూరు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి 

ముద్ర, షాద్‌నగర్:-తను సంపాదించిన ఆస్తిలో సగం నామినేషన్ రోజే ప్రజలకు రాసి ఇచ్చేస్తానని బీజేపీ నేత, పాలమూరు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపి పార్టీలో కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేసిన వైనంపై బిజెపి పెద్దల మోసపూరిత వాగ్దానాలపై నిప్పులు చేరిగారు. అన్ని పార్టీలకు దీటుగా తాను తన అభిమానుల కోరిక మేరకు బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. నామినేషన్ రోజే తన సగం ఆస్తి ప్రజల పేరిట రాసి తన సేవ దృక్పథాన్ని చాటుతానని అన్నారు.శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కుంట్ల రామ్ రెడ్డి గార్డెన్ లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అభిమానులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి బిజెపి టికెట్ రాకుండా కుట్ర చేశారంటూ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బిజెపిలో టికెట్ పై తన పేరు చెరిపేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో మాత్రం తన పేరును ఎవరు చెరిపేయలేరని సవాల్ విసిరారు. పెద్ద నేతల కుట్రలను బట్టబయలు చేసి ఎన్నికల్లో నిలబడతానని శపదం పూనారు. కల్లబొల్లి మాటలు చెప్పి లక్షలు చేతులు మార్చి పార్టీలు మార్చుతున్న నాయకులను పక్కనపెట్టి తన వెంట ప్రజలు నడిచి వస్తే కాళ్ళు మొక్కి సేవలు చేస్తానని అన్నారు. ప్రాణం పోయేంతవరకు సమాజ సేవను వదలనని అన్నారు. బిజెపిలో తనకు టికెట్ రాకూడదని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొక్కుకున్నారని కానీ టికెట్ రాకపోయినా బరిలో ఉండడం పక్కా అని అన్నారు. తనకు పార్టీలు జెండాలు లేకపోయినా ప్రజల ఎజెండా తన జెండా అని అన్నారు. మీ బిడ్డని మీ గ్రామాలకు వస్తా నన్ను ఆశీర్వదించి గెలిపించండి అంటూ విష్ణువర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రజా నిర్ణయం మీదైతే.. పోటీ నాది అవుతుందని అన్నారు. ఎందుకు నాపై కుట్ర చేశారు..? అక్షరాల 27 కోట్ల రూపాయలు ప్రజల కోసమే ఖర్చుపెట్టా.. ఐదు శాతం ఉన్న బిజెపి ఓటు బ్యాంకును 80% వరకు పెంచా.. ఇవే నేను చేసిన తప్పులా..? భారతీయ జనతా పార్టీలో తనకు టికెట్ రాకుండా మోసం చేశారంటూ ఆ పార్టీ సీనియర్ నేత పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి కంటతడి పెట్టారు. 

మోడీ చేతుల మీదుగా పార్టీలో చేరిన నేను సిద్ధాంతం కోసం కట్టుబడి సేవలనే నమ్ముకున్నానని, అయినా తనపై కొందరు పెద్దలు కుట్రలు ఆపలేదని అన్నారు. బిజెపి టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు. ఐదు శాతం ఉన్న ఓటు బ్యాంకును 80% వరకు ఈ అసెంబ్లీలో పెంచానని అన్నారు. టికెట్ రాకపోతే తనకు అధిష్టానం లో ఒక్క నాయకుడైన కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదని, టికెట్ కోసం చర్చ చేయకుండా ఏకపక్షంగా కేటాయించారని, టికెట్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. టికెట్ దొంగలు తన టికెట్ అమ్ముకున్నారని ఘాటుగా విమర్శించారు. నరేంద్ర మోడీ బొమ్మతో గ్రామ గ్రామాన తిరిగి పార్టీని బలోపేతం చేశానని, ప్రాణం పోయినంతవరకు ఇకపై సమాజసేవ చేస్తానని ప్రజలు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని అన్నారు.ఈ కార్యక్రమానికి బిజెపి సీనియర్ నాయకులు నర్సింహ యాదవ్, పల్లె ఆనంద్, మల్చలం మురళి, సుధాకర్ అప్ప, మోహన్ నాయక్, లష్కర్ నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, ఇశ్నాతి శ్రీనివాస్, ఆకుల ప్రదీప్, అనూష తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.