ఢీ అంటే ఢీ వేదిక అదే .. గ్యాప్ 3 రోజులే

ఢీ అంటే ఢీ వేదిక అదే .. గ్యాప్ 3 రోజులే
BRS public meeting in parade ground
  • సచివాలయం ప్రారంభోత్సం తర్వాత బహిరంగ సభ
  • జాతీయ నేతలతో కేసీఆర్​ రెండో మీటింగ్​
  • జన సమీకరణ మీదనే అధిక దృష్టి
  • మంత్రి కేటీఆర్ సభకు​హాజరవుతారా?

ముద్ర, తెలంగాణ బ్యూరో : కేసీఆర్​ జాతీయ రాజకీయాల వ్యూహాలు వేగంగా కదులుతున్నాయి. ఖమ్మం వేదికగా తొలి బహిరంగ సభను నిర్వహించి, జాతీయ నేతలతో బీజేపీ పై దూకుడు పెంచిన కేసీఆర్​.. ఇప్పుడు మోడీ తరహాలోనే మరో సభకు సిద్ధమయ్యారు. వచ్చేనెల 13న ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి, రైల్వే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, పరేడ్​ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇదే వేదికను బీఆర్ఎస్​ కూడా ఎంచుకుంది. మోడీ సభ జరిగిన ప్రాంతంలోనే తమ బలాన్ని నిరూపించుకునేందుకు వ్యూహం వేసింది. గతంలో బీజేపీ ఓ చోట సభ పెడితే.. కేసీఆర్​ మరో చోట నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు ఒకే వేదికపైనా నాలుగు రోజుల వ్యవధిలోనే బల నిరూపణకు దిగుతున్నారు. 

సభ ద్వారానే సంకేతం
రాష్ట్రంలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంటే.. బీఆర్ఎస్​ మాత్రం ఇతర రాష్ట్రాల నేతలను కూడదీస్తోంది. ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్​ భారీ వ్యూహాలే వేస్తున్నారు. ఖమ్మం వేదికగా తొలి సభను నిర్వహించగా, ఈ సభకు ఢిల్లీ, పంజాయ్​, కేరళ సీఎంలు, యూపీ మాజీ సీఎం, సీపీఐ జాతీయ నేతలను తీసుకువచ్చారు. ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను వివరిస్తూనే.. అంతా యాంటీ బీజేపీ స్లోగన్​ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ను ముందుంచి పోరాటం చేస్తామనే సంకేతాలిచ్చారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీజేపీ మరింత జోరు పెంచింది. కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు రాష్ట్రానికి బాట పట్టారు. ప్రధాని మోడీ కూడా వచ్చేందుకు టూర్​ ఖరారైంది. దీంతో బీఆర్​ఎస్​ మరింత ముందడుగు వేస్తోంది. బీజేపీ మాత్రమే రాజకీయ ప్రత్యర్థి అంటూ ఈసారి మోడీ సభను టార్గెట్​ చేసింది. అయితే, ఖమ్మం సభకు కొంతమంది నేతలు గైర్హాజరు కావడంతో బీఆర్​ఎస్​ కు మద్దతు తగ్గిందంటూ బీజేపీ ప్రచారానికి దిగింది. దీంతో తొలి బహిరంగ సభకు గైర్హాజరైన నేతలను ఈసారి రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో బీఆర్​ఎస్​ బలం పెరుగుతుందనే సంకేతాన్ని కేసీఆర్​ ఇవ్వనున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

పుట్టిన రోజునాడే
సీఎం కేసీఆర్​ పుట్టినరోజు ఫిబ్రవరి 17 సందర్భంగా రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పరేడ్​ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు తమిళనాడు సీఎం స్టాలిన్​, ఝార్ఖండ్​ సీఎం హేమంత్​ సోరెన్​, బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్​, బిహర్​ సీఎం నితీశ్​ తరుపున ప్రతినిధిగా జేడీయూ అధ్యక్షుడు లలన్​ సింగ్​, బీఆర్​ అంబేద్కర్​ మనవడు ప్రకాష్​ అంబేద్కర్​ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వీరందరినీ పరేడ్​ గ్రౌండ్​ సభకు తీసుకెళ్లనున్నారు. ఇక, బీజేపీ నిర్వహించే సభ కంటే ఎక్కువ స్థాయిలో జనాన్ని సమీకరించాలని బీఆర్​ఎస్​ ప్లాన్​ చేస్తోంది. దీని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

కేటీఆర్​ ఉంటారా..?
బీఆర్​ఎస్​ ఆవిర్భావం తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్​ వరుసగా దూరంగా ఉంటున్నారు. కీలక సమావేశాలకు వెళ్లడం లేదు. అటు ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సం, ఆ తర్వాత పార్టీ ప్రకటన, ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్​ పార్టీలో చేరిక సందర్భంగా నిర్వహించిన సమావేశంతో పాటుగా ఖమ్మంలో నిర్వహించిన తొలి సభకు సైతం గైర్హాజరయ్యారు. దీంతో పలు రకాల ప్రచారం జరిగింది. తాజాగా వచ్చేనెల 17న బీఆర్​ఎస్​ భారీ మీటింగ్​ ఏర్పాటు చేస్తుండటంతో.. కేటీఆర్​ ఉంటారా.. లేక ఏదైనా పర్యటన పేరుతో గైర్హాజరవుతారా అనే అనుమానాలు మొదలయ్యాయి.