ఆలోచించలేకపోతే ఆ ఓటే కాటేస్తది జాగ్రత్త...!

ఆలోచించలేకపోతే ఆ ఓటే కాటేస్తది జాగ్రత్త...!
  • ఓటు తలరాత మారుస్తది
  • తెలంగాణ కోసం పుట్టిందే బిఆర్ఎస్
  • మెదక్‌ సభలో సీఎం కేసీఆర్‌

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేసే ప్రమాదం ఉంటదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం మెదక్‌ లో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ అభ్యర్థి  పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో  కెసిఆర్ మాట్లాడుతూ.. ఎలక్షన్‌ వచ్చిందంటే ఆగమాగం అడివడివి కావద్దు, అబద్ధాలు చెప్పడం. అబాండాలు వేయడం ఇష్టమైన ప్రచారాలు చేయడం, జనాల్ని మోసం చేసే పని నడుస్తుంటుంది జాగ్రత్తగా ఆలోచించాలన్నారు. ఇది ప్రజాస్వామ్య పరిణితికి మంచిది కాదు. 75 సంవత్సరాల భారతంలో మన ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదని పేర్కొన్నారు. 

ఆలోచించి ఓటు వేస్తే లాభం

ఎన్నికల్లో అభ్యర్థుల చరిత్రను చూడాలని కెసిఆర్ సూచించారు. పార్టీ చరిత్ర, వైఖరి, నడవడిక, పార్టీకి అధికారం ఇస్తే ఏం చేశారు ? ఏం చేయలేదనేది గమనించాలని కోరారు.   ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే హైదరాబాద్‌లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఓటు అనేది తలరాతను రాస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి వేస్తే లాభం జరిగే అవకాశం ఉంటుందన్నారు. లేకపోతే ఆ ఓటే కాటేసే అవకాశం ఉంటుందని హెచ్చరిక చేశారు. బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసమన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ వచ్చిన సమయంలో గందరగోళమైన పరిస్థితులుండగా అవన్నీ సరిచేసి పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ఏం చేసిందో మీ కండ్లముందున్నదన్నారు.  పేదల సంక్షేమం, కరెంటు, రైతులు, సాగునీరు, పరిశ్రమలు, ఐటీరంగం వీటిపై దృష్టిపెట్టి పని చేసింది బీఆర్‌ఎస్‌ అని తెలిపారు.

సంక్షేమంలో మనకు ఎవరూ సాటి లేరు

‘సంక్షేమంలో మనం ఇండియాలోనే నెంబర్‌ వన్‌... మనకు ఎవరూ సాటిలేరని జకెసిఆర్ స్పష్టం చేశారు.  అద్భుతమైన సంక్షేమం ఇస్తున్నాం. రైతుల గురించి ఐదు కార్యక్రమాలను తీసుకున్నామన్నారు. గతంలో మెదక్‌ వచ్చిన సందర్భంలో అప్పటి కలెక్టర్‌ సూచన మేరకు నీటి తీరువా బకాయిలు రద్దు చేసిన విషయాన్నీ గుర్తు చేశారు. నీళ్లకు ట్యాక్స్‌ లేదు,  ఘనపురం, కాళేశ్వరం నీళ్లు వచ్చినా ట్యాక్స్‌ లేదన్నారు. మంచి నాణ్యమైన కరెంటు 24 గంటలు ఉచితంగా ఇస్తున్నామని, రైతుబంధు పెట్టుబడిగా,  పండించిన ధాన్యాన్ని నష్టం వచ్చినా ప్రభుత్వమే కొంటున్నదన్నారు. రైతుబీమా అందజేస్తున్నామన్నారు. కానీ 

రైతుబందు దుబారా  అంటున్నారు

కేసీఆర్‌కు పని లేదు,  ప్రజలు కట్టిన పన్నులన్నీ రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడని పీసీసీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు. రైతుబంధు ఉండాల్నా వద్దా ? రైతుబంధు ఉండాలంటే పద్మాదేవేంద్‌రెడ్డి గెలవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రైతు బందు రూ.16వేలు అవుతుందన్నారు.   రైతులకు వ్యవసాయానికి 24 గంటల కరెంటు కూడా వేస్ట్‌ అంటున్నారని కాంగ్రెస్ పై ద్వజమేత్తారు. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు సరిపోతుంది?  మూడుగంటలకు మడి తడుస్తుందా అని ప్రశ్నించారు.పది హెచ్‌పీల మోటర్‌ పెట్టుకోవాలట? మరి రైతుల దగ్గర పది హెచ్‌పీల మోటర్‌ ఉంటదా? 3, 5 హెచ్‌పీల మోటర్లు మనదగ్గర ఉంటాయి. మరి రైతుల దగ్గర 30లక్షల మోటర్లు ఉన్నయ్‌. మరి వాటిని మార్చాలంటే డబ్బులు ఎవడు ఇవ్వాలి..? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు.

పద్మ పవర్ తెలుసు కదా..! గెలిపించండి

నా బిడ్డ పద్మను గెలిపించాలని కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. పద్మ పవర్ తెలుసు కదా రామాయంపేట డివిజన్, డిగ్రీ కళాశాల అడిగింది, ఇచ్చాను, మంత్రి హరీష్ రావు వచ్చి ప్రారంభించారని కెసిఆర్ గుర్తు చేశారు. గెలిపిస్తే రింగ్ రోడ్డు, ఇంగనీరింగ్ కళాశాలతో పాటు అనేక పనులు చేసుకోవచ్చన్నారు. పద్మపై పోటీ చేసే అభ్యర్థి దిష్టిబొమ్మ మాదిరిగా ఉన్నాడన్నారు. పద్మను గెలిపించి మెదక్ అభివృద్ధి చేసుకువాలని ఓటర్లని కోరారు. ఈ సభలో మంత్రి హరిష్ రావు, అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, మధుసూదనాచారి, వెంకట్ రాం రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, జెడ్పి చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, ఇంచార్జి తిరుపతి రెడ్డి, సోములు, గ్యాదరి బాలమల్లు, చంద్రపాల్, జితేందర్ గౌడ్, సారాఫ్ యాదగిరి, బట్టి జగపతి, దేవేందర్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, పుట్టి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.