మునుగోడులో సిపిఐ పోటీ చేస్తుంది: సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు

మునుగోడులో సిపిఐ పోటీ చేస్తుంది: సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు

భువనగిరి అక్టోబర్ 11 (ముద్ర న్యూస్):-అఖిలభారత యువజన సమాఖ్య -ఏఐవైఎఫ్ జిల్లా సమితి సమావేశం సిపిఐ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు హాజరై మాట్లాడుతూ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగుతుందని రాజకీయ పరమైన అవగాహన వచ్చిందని దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ నాయకులు మాట్లాడుతున్నారని ప్రస్తుతం మునుగోడులో సిపిఐ శాసనసభ ఎన్నికలలో పోటీ చేస్తుందని సమావేశంలో తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో పాలకవర్గాలు నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, ఉపాధి కల్పన చేయకుండా మతోన్మాద రాజకీయాలను నేటి యువతకు నూరి పోస్తూ దేశ సమగ్రతకు విఘాతం కల్గించే విధానాలను పాలకులు అమలు చేస్తున్నారని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా భర్తీ చేయాలని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతి 3116 రూపాయలు ప్రకటించిన నాలుగేళ్లు గడిచినా అమలు చేయలేదని వారన్నారు, ఈ పరిణామాలను యువత నిశితంగా పరిశీలన చేయాలని అన్నారు, ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రశ్న పత్రాల లీకేజీలు సర్వసాధారణంగా మారింది నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టివేసిందని విద్యారంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రితో సమీక్ష చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు,  బిఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలలో యువత  తగిన బుద్ధి చెప్పాలని  వారన్నారు.దేశాన్ని ప్రజలను ఐక్యంగా కాపాడాల్సిన బాధ్యత నేటి తరం యువతదేనని వారు ఉద్ఘాటించారు. నాటి స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను, వాటి ఫలాలను నేటి యువతకు అందనీయకుండా పాలకులు కుయుక్తులు పన్నుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి దేశంలో పేదరికం,దారిద్ర్యం, ఆకలి కేకలు ఎందుకు తీరలేదో పాలకులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు పోరాటం ద్వారా మాత్రమే తమ న్యాయమైన హక్కులను పొందుతారని అన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా 249 ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని తద్వారా 59లక్షలకు పైగా ఉద్యోగులు తమ ఉపాధి ని కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా 90లక్షల మంది ప్రజలు వైరస్ కారణంగా మరణిస్తే, కేవలం 4లక్షల మంది మాత్రమే చనిపోయారని తప్పుడు లెక్కల ప్రకటనను కార్పొరేట్ రంగానికి చెందిన ప్రముఖ వార్తా పత్రికలలో ప్రచురితమైనదని వారు గుర్తుచేశారు. మోడీ విధానాలు దేశానికి అత్యంత ప్రమాదకర, విచ్చినకర విధానాలని.ఈ విధానాలను దేశంలో 45కోట్లకు పైగా ఉన్న యువతే ఓటు ద్వారా మార్చగలరని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మాజీ నాయకులు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్,ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు సుద్దాల సాయికుమార్, కంబాలపల్లి వెంకటేష్, మేడి దేవేందర్, అనంతుల నరసింహ తదితరులు పాల్గొన్నారు.