గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు ఏఈఈ, డీఏఓ పరీక్షలు కూడా 

గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దు ఏఈఈ, డీఏఓ పరీక్షలు కూడా 
  • జూన్​11న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష​
  • మిగతా పరీక్షలపై తర్వాత నిర్ణయం
  • లీక్ లో కీలక సూత్రధారి రాజశేఖర్​
  • రాజశేఖర్ టు రేణుక వయా ప్రవీణ్
  • విచారణలో అనేక ఆసక్తికర అంశాలు​
  • పాస్‌వర్డ్‌ ఎలా బయటకు వచ్చిందో తేలలే ?
  • టీఎస్​పీఎస్సీకి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన సిట్​
  • వేలాది మంది అభ్యర్థుల ఆశల మీద నీళ్లు


ముద్ర, తెలంగాణ బ్యూరో: ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా పదకొండేండ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్​– ప్రిలిమ్స్​పరీక్ష రద్దయ్యింది. పేపర్ల లీకేజీలో గ్రూప్–1 ప్రిలిమ్స్ కూడా ఉండటంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. దీంతో ప్రిలిమ్స్​ పరీక్షలో అర్హత సాధించిన 25 వేల మంది ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నవారు, కోచింగ్​సెంటర్లకే పరిమితమైనవారు, ప్రస్తుత ఉద్యోగాలను వదిలేసినవారు, సెలవు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నవారికి లీకేజీ వ్యవహారం షాక్​ ఇచ్చింది. నిరుడు అక్టోబర్​ 16న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్​తో పాటుగా ఈ యేడాది జనవరి 22న నిర్వహించిన ఏఈఈ, ఫిబ్రవరి 26న నిర్వహించిన డీఏఓ పరీక్షలను సైతం రద్దు చేశారు.  గ్రూప్​– ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏఓ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ లీకైనట్లుగా సిట్​దర్యాప్తులో తేలింది. రద్దు చేసిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి​జూన్ 11న   నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. సిట్​నివేదిక ఆధారంగానే ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. గ్రూప్​–1 మెయిన్స్​పరీక్ష జూలై 1న నిర్వహిస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు దీని మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని పరీక్షలను కూడా వాయిదా వేసే యోచనలో టీఎస్‌పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కటే కాదు, చాలా పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు సిట్ విచారణలో వెలుగు చూసింది. టీఎస్​పీఎస్సీ 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ లేదా జులైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. దానినీ వాయిదా వేశారు.  833 ఏఈ పోస్టులకు 56 వేల మంది అప్లయి చేస్తుకున్నారు. మార్చి ఐదున జరిగిన ఈ పరీక్షనూ రద్దు చేశారు. 175 టౌన్ ప్లానింగ్ ఉద్యోగాల కోసం 55 వేల మంది దరఖాస్తు చేశారు. ఎగ్జామ్ డేట్ ప్రకటించే లోపే పేపర్ లీక్ కావడంతో  రద్దు చేశారు. 113 ఎంవీఐ పోస్టులకు జరగాల్సిన పరీక్షలనూ రద్దు చేశారు. నిరుడు నిర్వహించిన గ్రూప్​–1 ప్రిలిమ్స్​ పరీక్షను రెండున్నర లక్షల మంది పరీక్ష రాశారు. 25 వేల మందిని మెయిన్స్​ కు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ పరీక్షను రద్దు చేశారు. 1,540 ఏఈఈ పోస్టుల భర్తీకి జనవరి ఒకటిన జరిగిన పరీక్షనూ రద్దు చేశారు. 81,548 మంది ఈ పరీక్ష రాశారు. 53 డివిజినల్ అకౌంట్స్​ఆఫీసర్ (డీఏఓ)  పోస్టుల భర్తీకి 26 ఫిబ్రవరి 2023న పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 1,06,253 మంది రాశారు. 


సిట్ బిగ్ ట్విస్ట్
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో సిట్‌ పెద్ద ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌ అని తేల్చి చెప్పింది.​ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీకి శుక్రవారం తన నివేదికను అందించింది. టెక్నికల్‌ సర్వీస్‌లో పని చేసే రాజశేఖర్‌ ఉద్దేశపూర్వకంగానే ఇక్కడకు డిప్యూటేషన్‌పై వచ్చాడని, కం‍ప్యూటర్‌ను హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ను దొంగిలించాడని నివేదించింది. టీఎస్​పీఎస్సీలో చేరాక ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉండి, దాదాపు ఐదు పరీక్షా పత్రాలను పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి అతడికి ఇచ్చాడని వివరించింది. ఫిబ్రవరి 27న వీటిని ప్రవీణ్ వేరే పెన్ డ్రైవ్ లో కాపీ చేసాడని, జూలైలో జరగాల్సిన జేఎల్ పరీక్ష ప్రశ్నాపత్రం సైతం ఇందులో ఉందని సిట్‌ అధికారులు తేల్చారు. రాజశేఖర్​ఇచ్చిన ప్రశ్న పత్రాలను ప్రవీణ్‌ తీసుకెళ్లి రేణుకకు, వాటిని రేణు విక్రయాలకు పెట్టిందని తేలింది.  కీలక పాస్‌వర్డ్‌ ఎలా బయటకు వచ్చిందనే విషయంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. పాస్‌వర్డ్‌ను శంకరలక్ష్మి అనే ఉద్యోగి డైరీ నుంచి కొట్టేశానని ప్రవీణ్ చెబుతున్నాడని, ఆమె మాత్రం పాస్‌వర్డ్‌ను తాను డైరీలో రాయలేదని చెబుతోందని, దీంతో ఆమె పాత్రపైనా విచారణ జరుపుతున్నామని సిట్​ పేర్కొంది. అంతకు ముందు సెక్రెటరీ పీఏగా పని చేస్తున్న క్రమంలోనే ప్రవీణ్​.. గ్రూప్​ –1 ప్రిలిమ్స్​ పేపర్​ ను దొంగిలించినట్లు సిట్​ తేల్చింది. 

నిందితులకు ఆరు రోజుల కస్టడీ
టీఎస్పీఎస్సీ పేపర్​లీక్​ ఘటనలో ప్రవీణ్​సహా తొమ్మిది మందిపై కేసులు నమోదయ్యాయి. వీరందరినీ పది రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు  ఆరు రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. మార్చి 18 నుంచి 23 వరకు వీరు పోలీస్ కస్టడీలో ఉండనున్నారు. శనివారం ఉదయం 9:30 నుంచి సిట్ విచారణ జరగనుంది. ఈ క్రమంలో నిందితుల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకెన్ని పేపర్లు లీక్ చేశారన్న దానిపై నిందితులను విచారించే చాన్స్ ఉంది, తొమ్మిది మంది నిందితులను ప్రస్తుతం చెంచల్ గుడా సెంట్రల్ జైలుకు తరలించారు.