ఎకరానికి రూ 20 వేల నష్టపరిహారం ఇవ్వాలి - రుణ మాఫీ ఎప్పుడు చేస్తారు - పంటలను పరిశీలించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి  

ఎకరానికి రూ 20 వేల నష్టపరిహారం ఇవ్వాలి - రుణ మాఫీ ఎప్పుడు చేస్తారు  - పంటలను పరిశీలించిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి  

ముద్ర ప్రతినిధి కామారెడ్డి:  అకాల వర్షం కారణంగా పంటలను కోల్పోయిన రైతులకు ఎకరానికి రూ.20 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని, వెంటనే రుణమాఫీ చేయాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం ఆయన మాజీమంత్రి షబ్బీర్ అలి తో కలిసి కామారెడ్డి జిల్లా పొందుర్తి గ్రామంలో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించారు.  పంటలను కోల్పోయిన రైతులను ఓదార్చారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉండగా, వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళనాలు, ప్లీనరీ సభలు నిర్వహిస్తూ  రైతులను విస్మరిస్తున్నారని అన్నారు. రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని, ఈ మేరకు బీజేపీ నాయకులు సైతం ఒత్తిడి పెంచాలని, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందని అన్నారు. రైతు ప్రభుత్వం గా చెప్పుకొనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయని, ఇది కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యం కదా అని ప్రశ్నించారు.  రైతులు నష్టపోయిన పంటలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేస్తామని, రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకుంటామని, రైతులెవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నా, ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.రేవంత్ రెడ్డి వెంట డిసిసి జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి సెగ్మెంట్ ఇంచార్జి సుభాష్ రెడ్డి, నాయకులు ఇంద్రకరణ్ రెడ్డి, యాదవవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.