మా భూమి మాకు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు బాదిత కుటుంబ సభ్యుల ఆందోళన...

మా భూమి మాకు చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు బాదిత కుటుంబ సభ్యుల ఆందోళన...

 ఆలేరు (ముద్ర న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని పటేల్ గూడెం గ్రామానికి చెందిన కందటి నర్సమ్మ తన భర్త రామచంద్రారెడ్డి పేరుపై గ్రామంలోని సర్వేనెంబర్  96/ఊ లో గల తన భర్త పేరు గల మూడు ఎకరాల భూమిని తన కొడుకు అయిన నర్సిరెడ్డి రెవిన్యూ అధికారులతో కుమ్మక్కై తన పేరుపై మార్చుకొని తనను భూమిలోకి రాకుండా అడ్డుకుంటూ. బెదిరింపులు. దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన భర్త పేరుపై గల భూమిని ముగ్గురు కుమారులకు సమభాగాలలో పంపిణీ చేసి. మూడు ఎకరాల భూమిని తమ పోషణ కోసం తన భర్త పేరుపై ఉంచుకున్నట్లు తెలిపారు. తమ భర్త జనవరి 1 2014లో మరణించినట్లు చెప్పారు. నాటి నుండి నేటి వరకు తన భర్త పేరు పై గల భూమిని తమ పేరుపై మార్చాలని కోరుతూ తహసిల్దార్ తో పాటు రెవిన్యూ డివిజనల్ అధికారి. జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినట్లు వివరించారు. ఆర్డీవో తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ రెవెన్యూ అధికారులు తన కుమారునితో కుమ్మక్కై తన పేరుపై భూమి చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

ఇటీవల జిల్లా రెవిన్యూ కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆయన తాసిల్దార్ కు చరవాణిలో సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ తమ కుటుంబ సభ్యుల నుండి సమాచారం సేకరించినట్లు గుర్తు చేశారు. తన కుమారుడు అయిన నర్సిరెడ్డి మినహా కుమారుడు. కుమార్తెలు. మనవలు తన పేరుపై భూమిని మార్చుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినప్పటికీ తహసిల్దార్ తమకు సంబంధించిన విచారణ కాగితాలను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మానసిక ఆవేదనకు గురైన నరసమ్మ పురుగుల మందు డబ్బాతో న్యాయం చేయాలని లేకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఆలేరు ఎస్సై తన సిబ్బందిని హుటాహుటిన తాసిల్దార్ కార్యాలయానికి పంపగా ఏఎస్ఐ మోహన్ తాసిల్దార్ తో చరవాణిలో మాట్లాడి సమస్య పరిష్కారంలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.

 అనంతరం తాసిల్దార్ బుధవారం నాడు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో నరసమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. బుధవారం నాడు తహసిల్దార్ సమస్యను పరిష్కరించకుంటే తాసిల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని నరసమ్మ హెచ్చరించారు. జిల్లా రెవిన్యూ అధికారుల ఆదేశాలను బేకాతరు చేస్తూ తాసిల్దార్ తన కుమారునికి పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపించారు. తన భర్త పేరుపై గల భూమిని తన పేరుపై మార్చి పట్టాదారు పాసుపుస్తకం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.