అభయహస్తం దరఖాస్తు ఫారాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేయాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

అభయహస్తం దరఖాస్తు ఫారాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేయాలి   – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్

ముద్ర.వనపర్తి:- ప్రజల నుండి స్వీకరించిన   అభయహస్తం దరఖాస్తు ఫారాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను అత్యంత పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆరు గ్యారంటీల అమలుకు గాను ప్రజాపాలన కార్యక్రమం ద్వారా డిసెంబర్, 28 నుండి జనవరి 6వ తేదీ వరకు స్వీకరించడం జరుగుతుంది. ఈ అభయహస్తం దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్ లో డిజిటలైజేషన్ చేసేందుకు వనపర్తి జిల్లాలో దాదాపు 500 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను గుర్తించి శుక్రవారం ఉదయం ఐ డి. ఓ.సి ప్రజావాణి హాల్లో మాస్టర్ ట్రైనర్ ల ద్వారా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు స్పష్టమైన అవగాహన, దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ డేటా ఎంట్రీ ఆపరేటర్లు దరఖాస్తులను ఆన్లైన్ లో ఏవిధంగా నమోదు చేయాలి, నమోదు చేసేటప్పుడు ఎటువంటి సాంకేతిక సమస్యలు వస్తాయి అనే విషయాలు ఒకటికి రెండుసార్లు మాస్టర్ ట్రైనర్ ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు.అణువంత అనుమానం ఉన్న నివృత్తి చేసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితిలో తప్పులు చేయవద్దని తెలియజేశారు.  

ముఖ్యంగా డాటా ఎంట్రీ అనేది చాలా ఖచ్చితత్వం తో ఉండాలని, దరఖాస్తు దారుడు ఎది నమోదు చేసి ఉంటే అదే వివరాలు నమోదు చేయాలి తప్ప స్వంత ఆలోచనలతో నింపవద్దని ఆదేశించారు.  ప్రతి డాటా ఎంట్రీ ఆపరేటర్ కు ఒక ప్రత్యేకమైన యూజర్ ఐడి ఇవ్వడం జరుగుతుందనీ అట్టి యూజర్ ఐ డి నుండి మాత్రమే డాటా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఆధార్ నమోదు మాత్రం ఒక వేళ దరఖాస్తుదారులు తప్పు గా నమోదు చేసి ఉంటే దరఖాస్తు ఫారం తో జతపరచిన జిరాక్స్ ప్రతిని పరిశీలించి సరైన ఆధార్ నెంబర్ నమోదు చేయాలని సూచించారు.దరఖాస్తులో ఏదైతే సంక్షేమ పథకాలు కావాలి అని టిక్ చేశారో అవి మాత్రమే నమోదు చేయాలని ఎట్టిపరిస్థితుల్లో వ్యత్యాసం రావడానికి వీలు లేదన్నారు.దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత వచ్చే యునిక్ నెంబరు ను దరఖాస్తు పై రాసి తన పేరు, మొబైల్ నెంబర్ సైతం నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.  ఏదైనా పొరపాట్లు జరిగితే డాటా ఎంట్రీ చేసిన ఆపరేటర్ మాత్రమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.డిజిటలైజేషన్ ప్రక్రియను ఈరోజు మధ్యాహ్నం నుండి ప్రారంభం అవుతుందని, జనవరి, 13 లోగా ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.  గ్రామపంచాయతీ లేదా మున్సిపాలిటీ నుండి ఎన్ని దరఖాస్తులు తీసుకుంటారో అన్ని దరఖాస్తులు జాగ్రత్తగా డేటా ఎంట్రీ పూర్తి చేసిన అనంతరం తిరిగి అప్పగించాల్సి ఉంటుందన్నారు.మాస్టర్ ట్రైనర్ శంకర్ ఫారాలను ఏవిధంగా డిజిటలైజేశన్ చేయాలో ఎల్. ఈ డి. ప్రొజెక్టర్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎస్. తిరుపతి రావు, జిల్లా అధికారులు,  మాస్టర్ ట్రైనర్ లు శంకర్, విజయ్ కుమార్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.