ఏలేటి ఆరోగ్యం  మరింత విషమం!

ఏలేటి ఆరోగ్యం  మరింత విషమం!
  • నిర్మల్​లో మిన్నంటిన ఆందోళనలు
  • సంఘీభావం తెలిపేందుకు వస్తున్న డీకే అరుణ అరెస్ట్​
  • మినిస్టర్​అల్లోల ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం
  • నేతలను అడ్డుకున్న పోలీసులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్, 220 జీఓలకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి దీక్ష ఆదివారం ఐదో రోజుకు చేరింది. ఆయన పరిస్థితి క్షణక్షణం దిగజారుతోంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతున్నాయి. శనివారం నుంచి కనీసం ఐదు నిముషాల కూడా కూర్చోలేని పరిస్థితికి ఏలేటి చేరారు. దీంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీక్ష విరమణ దిశగా యత్నం చేయకపోగా, పరీక్షలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు  చేయకపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

  • మంత్రి ఇంటి ముట్టడికి బీజేపీ యత్నం

ఏలేటి ఆరోగ్యం విషమించడంతో నిర్మల్ పట్టణం రాస్తారోకోలు, ర్యాలీలు, ముట్టడితో ఆదివారం రణరంగాన్ని తలపించింది. ఉదయం నుంచి ఎక్కడికక్కడే పోలీసులు మొహరించారు. మహేశ్వర్​రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను మార్గమధ్యంలో అరెస్టు  చేశారన్న వార్త రాగానే బీజేపీ కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున ర్యాలీగా బయలు దేరారు. డాక్టర్స్ లేన్ వద్ద రాస్తారోకో చేపట్టారు. అనంతరం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా కొంతమంది పోలీసులు మహేశ్వర్ రెడ్డి ఇంట్లోకి వచ్చేందుకు యత్నిస్తున్న తరుణంలో కార్యకర్తలు గేటు బయటే అడ్డుకున్నారు. కాగా మహేశ్వర్ రెడ్డికి సంఘీభావం ప్రకటించడానికి వస్తున్న భైంసా, ముథోల్, ఖానాపూర్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లోని బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • పోలీసుల చర్యలు హేయం : రాంనాథ్

రైతులకోసం ఆమరణ దీక్ష చేస్తున్న  మహేశ్వర్ రెడ్డికి మద్దతుగా శాంతియుతంగా మంత్రి ఇంటికి వెళుతుంటే పోలీసులు లాఠీ చార్జి చేయటం, గాయపరచటం హేయమని బీజేపీ పెద్దపల్లి ఇన్​చార్జి రావుల రాంనాథ్ విమర్శించారు. 220 జీఓ అమలు పరుస్తామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ ప్రకటించటం వారి ఎత్తుగడలకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. 

  • నేడు కిషన్​రెడ్డి రాక..

బీజేపీ స్టేట్​చీఫ్​కిషన్​రెడ్డి సోమవారం నిర్మల్ కు వస్తున్నారని రాంనాథ్ తెలిపారు. మహేశ్వర్ రెడ్డికి సంఘీభావంగా ఆయన రానున్నారని పేర్కొన్నారు. ఆయనను అడ్డుకొనేందుకు యత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.