బీఆర్ఎస్ లో  అసమ్మతి సెగలు

బీఆర్ఎస్ లో  అసమ్మతి సెగలు
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న నేతలు
  • పలు నియోజకవర్గాల్లో జోరుగా క్యాంప్ రాజకీయాలు
  • ఎమ్మెల్సీ కవితను కలిసిన భేతి, బొంతు రామ్మోహన్
  • హరీశ్​రావుతో భేటీ అయిన ఎమ్మెల్యే హరిప్రియ


ముద్ర, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో నాయకులు ముఠాలు, వర్గాలుగా విడిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. నేడో, రేపో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాలని బీఆర్ఎస్​అధినేత కేసీఆర్ యోచిస్తుండగా.. పలు నియోజకవర్గాల్లో నెలకొన్న గందరగోళ పరిస్థితులు అధిష్టానానికి గుబులు రేపుతున్నాయి. 

  • ఉప్పల్ పై ముగ్గురి కన్ను..

ఇప్పటిదాకా ఉప్పల్ నియోజకవర్గంపై ముగ్గురు నేతలు కన్నేశారు. వారిలో  సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్​బొంతు రామ్మోహన్, మరో సీనియర్ నాయకుడు బండారు లక్ష్మారెడ్డి ఉన్నారు. పార్టీ అధిష్టానం ఉప్పల్ సీటును లక్ష్మారెడ్డికి కేటాయిస్తుందని సోషల్ మీడియాతోపాటు పలు దినపత్రికల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో లక్ష్మారెడ్డికి వ్యతిరేకంగా భేతి, బొంతు చేతులు కలిపారు. వారిద్దరూ ఆదివారం ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఉప్పల్ టిక్కెట్టు ఉద్యమకారులకే కేటాయించాలంటూ వేడుకున్నారు. తమలో ఎవరికి టిక్కెట్​ఇచ్చినా కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. అంతే తప్ప కాంగ్రెస్ నుంచి వచ్చిన లక్ష్మారెడ్డికి ఎట్టి పరిస్థితుల్లోనూ సీటు కేటాయించకుండా చూడాలని కవితకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని వారికి కవిత హామీ ఇచ్చారు.

  • హరిప్రియపై నేతల తిరుబాటు..

భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై పార్టీ నేతలు తిరుబాటు జెండా ఎగురవేశారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇంట్లో సమావేశమైన ఆసమ్మతి నేతలు.. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానవర్గానికి అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరిసింగ్ నియోజకవర్గంలో షాడోగా వ్యవహరించి పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టించారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వీరిలో..  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పులిగల మాధవరావు, ఇల్లెందు ఎంపీపీ భర్త జానీ పాషా, ఇల్లెందు పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్ణ, మహబూబాబాద్ జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు తండ్రి శ్రీకాంత్, బయ్యారం పీఎస్ఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, గార్ల మండలం మాజీ ఎంపీపీ వెంకట్ లాల్ తోపాటు మరో 20 మంది నేతలు  పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కూతురు అనూరాధకు ఈసారి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి 8 సార్లు పోటీ చేసి ఐదు సార్లు గుమ్మడి నరసయ్య గెలిచారు. కానీ తన పదవీకాలం అంతా ప్రజల మధ్యనే ఆయన గడిపారు. ఎలాంటి హంగూ, ఆర్భాటాల జోలికి వెళ్లలేదు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని ఆయన కుటుంబానికి ఈసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆదివారం హైదరాబాద్ చేరుకుని మంత్రి హరీశ్​రావుతో భేటీ అయ్యారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ రావడంతో హరిప్రియ తిరిగి ఇల్లెందుకు పయనమయ్యారు.

  • భూపాలపల్లిలో ఉద్యమకారుల హెచ్చరిక.. 

అంబర్ పేట్ నియోజకవర్గంలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​కు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయనకు ఈ సారి టికెట్ దక్కకుండా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు. ఆదివారం వారంతూ సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాలేరుకు టిక్కెట్టు కేటాయించవద్దంటూ కోరారు. అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలోనూ అలజడి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి టిక్కెట్​ ఇవ్వవద్దంటూ మాజీ స్పీకర్ మధుసూదనాచారి వర్గీయులు పార్టీ అధిష్టానవర్గానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ లోనే ఉంటూ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడైన మధుసూదనాచారికే భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. గండ్రకే టికెట్ ఇస్తే 150 మంది ఉద్యమకారులు నామినేషన్ వేస్తామని అధిష్టానాన్ని బహిరంగంగానే హెచ్చరించారు. 

  • జహీరాబాద్ లోనూ ఇదే పరిస్థితి..

ఎస్సీ రిజర్వుడ్ సీట్​అయిన జహీరాబాద్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఇటీవలే బీఆర్ఎస్ లో చేరిన నరోత్తంకు టికెట్ వస్తుందని ప్రచారం జరగడంతో ఎమ్మెల్యే వర్గీయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వారంతా మాణిక్ రావుకే టికెట్టు కేటాయించాలంటూ అధిష్టానాన్ని వేడుకుంటున్నారు. ఇదే సమయంలో వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ టిక్కెట్ల జాబితాను విడుదల చేసే సమయంలో ఈ ఫొటో బయటకు రావడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములు నాయక్ కొనసాగుతున్నారు. ఈ టిక్కెట్టు కోసం మదన్ లాల్ తీవ్రంగా ప్రయత్నిస్తుండడంతో మహిళతో ఉన్న ఫొటోలు ఇపుడు వైరల్​గా మారాయి. అయితే  ఈ ఫొటోలు నిజమైనవా, మార్ఫింగ్ చేసినవా అనేది తేలాల్సి ఉంది.