నరకాన్ని చూపిస్తున్న రసాయన కంపెనీలు

నరకాన్ని చూపిస్తున్న రసాయన కంపెనీలు
  • ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిశ్రమలు
  • గ్రామాలను కుమ్మేస్తున్న విషవాయువు
  • అనారోగ్యం పాలవుతున్న ప్రజలు
  • నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీలు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

భూదాన్ పోచంపల్లి, ముద్ర:-మండలంలో ఉన్న అన్ని కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వెదజల్లే విషవాయువులు అన్ని గ్రామాలను కమ్మేసి  ఊపిరి పీల్చుకోకుండా నరకాన్ని చూపిస్తుంది. రాత్రి అయితే చాలు మండల ప్రజలు దుర్వాసనతో బెంబేలెత్తిపోతున్నారు. పిల్లల నుంచి పండు ముసలి వరకు రసాయన ఫ్యాక్టరీల నుంచి వచ్చే భయంకర దుర్వాసనతో ఆరోగ్యం, ప్రాణాలు ఏమవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. మండల ప్రజలు ఇటు కంపెనీ యజమాన్యాలతో అటు అధికారులతో మరోవైపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్న రసాయన ఫ్యాక్టరీలపై చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. ముఖ్యంగా రాత్రి వేళల్లో కెమికల్ ఫ్యాక్టరీ నుండి వెదజల్లే దుర్వాసనతో గ్రామ ప్రజలు ముక్కులు మూసుకుని తలుపులు బిగించుకొని కాలం గడుపుతున్నారు . రసాయన కంపెనీల నుండి విడుదలయ్యే కలుషిత నీరు భూమిలోకి  వదులుతుండడంతో వ్యవసాయదారులు, ప్రజలు, మూగజీవాలు అనేక రోగాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుల లీకేజీలను నివారించకపోతే శ్వాస సంబంధిత వ్యాధులతో తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చి ప్రాణం నష్టం కూడా సంభవించే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలుష్య కారక కంపెనీలపై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు స్పందించి విషవాయువులు రాకుండా చేసి ఆయా రసాయన ఫ్యాక్టరీలను మూసివేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.

ప్రాణం పోతేనే పట్టించుకుంటారా

 ఈ కంపెనీల నుంచి వచ్చే విషవాయువుల వల్ల ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రాత్రి నుంచి మొదలుకొని మరుసటి రోజు ఉదయం వరకు ఘోరమైన దుర్వాసనతో నిద్ర పోలేక అనేక వ్యాధుల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నాము. వాసన గురించి అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. ఈ దుర్వాసన నుండి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఆ దేవుడికే తెలియాలి.అందరూ కాసులకు కక్కుర్తి పడి మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

           కొంక లక్ష్మీనారాయణ.   పోచంపల్లి వాసి