కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన

కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన

నిలిచిన మిర్చి కొనుగోళ్లు 
కేసముద్రం, ముద్ర: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్ గా మారి గురువారం మిర్చి ధర అమాంతం తగ్గించారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ మార్కెట్లతో పోలిస్తే కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో తేజ రకం మిర్చికి క్వింటాలకు గరిష్టంగా 2వేల రూపాయలు తగ్గించారని నిరసనకు దిగారు. ఈ-నామ్ టెండర్ విధానంలో మిర్చి ధరలు విడుదల చేయగానే గత నాలుగు రోజులతో పోలిస్తే గురువారం కింటాలుకు 2వేల రూపాయలు తగ్గిందని రైతులు మిర్చి యార్డు నుంచి మార్కెట్ కార్యాలయం వరకు వచ్చి మిర్చితో నిరసన తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున మార్కెట్ కార్యాలయానికి తరలి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే మార్కెట్ పాలకమండలి ప్రతినిధులు, అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తక్కువ ధరకు వేసిన వ్యాపారుల టెండర్లు రద్దు చేయాలని మళ్లీ రీ టెండర్ పెట్టాలని, లేదంటే ఓపెన్ యాక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారులు, మార్కెట్ పాలకమండలి ప్రతినిధులు, పోలీసులు రైతుల సమక్షంలో చర్చలు నిర్వహించారు. చివరకు నాణ్యమైన మిర్చి కేసముద్రం మార్కెట్ కు రావడంలేదని, వరంగల్ మార్కెట్ కు నాణ్యమైన మిర్చి వస్తుండడంతో ఆ విధంగా మిర్చికి ధర ఇక్కడ పెట్టాలనడం సరికాదని వ్యాపారులు చెప్పారు. చివరకు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో టెండర్లో నిర్ణయించిన ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు ధర పెంచి ఇవ్వాలని నిర్ణయించారు. దీనితో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మిర్చి కాంటాలు నిలిచిపోయాయి. దీనితో రైతులు యార్డులో పడి కాపులు పడాల్సి వచ్చింది.