ప్రజా ధనం దుర్వినియోగం పై విజిలెన్స్, సీబీఐ లకు ఫిర్యాదు చేస్తా

ప్రజా ధనం దుర్వినియోగం పై విజిలెన్స్, సీబీఐ లకు ఫిర్యాదు చేస్తా

మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట జరుగుతున్న నిధుల దుర్వినియోగం పై కేంద్ర, రాష్ట్ర విజిలెన్స్, సీబీఐ కి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తే సక్రమంగా వ్యయం చేయకుండా దుబారా జరుగుతోందని ఆయన ఆరోపించారు. మాతా శిశు కేంద్రం భవనం వరద నీటితో మునిగిపోయిన తర్వాత మూడు కోట్ల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్ నిర్మించడం శోచనీయమని అన్నారు. జాతీయ రహదారి నిర్మాణం, విస్తరణ లో చేతివాటం జరిగినట్లు నిర్మాణం పనులు చూస్తే తెలుస్తోందని అన్నారు. మంచిర్యాల సుందరీకరణ పేరిట చౌరస్తాల విస్తరణ కూడా విజన్ లేకుండా ఉందని ఆయన విమర్శించారు. సర్కిల్ పెద్దగా కట్టడం వల్ల రోడ్లు ఇరుకుగా మారాయని ఆయన తెలిపారు. అభివృద్ధి పనులు ప్రణాళిక లేకుండా జరుగుతూ ప్రజాధనం దుబారా చేస్తున్నారని ఆయన అన్నారు. నిధులు వ్యయంపై కేంద్ర, రాష్ట్ర విజిలెన్స్ లేదా సీబీఐకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు కూడా అందుకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రజాధనం వినియోగం విషయం లో కాంగ్రెస్ కాపలా కుక్కల వ్యవహరిస్తుందని అన్నారు.

ఎమ్మెల్యే దివాకర్ రావు తనపై విమర్శలు చేస్తే కానీ పొద్దుపొదని ఎద్దేవాచేశారు.  వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తే తప్పకుండా ఆయన విమర్శలకు తగిన రీతిలో జవాబిస్తానను అన్నారు. ఈసారి దివాకర్ రావుకు టికెట్ పోటీ బాగుందని పోటీ అభ్యర్థుల్లో ఆయన కుమారుడు విజిత్ రావు ముందున్నారని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి టికెట్ ఇవ్వకపోతే బీజేపీ లోకి వెళ్తాడనే ప్రచారం ఉందని అన్నారు. మరోవైపు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుసుకురి రామ్ మోహన్ రావు తనకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నాడని బీఆరెస్ లొనే టికెట్ ల పోటీ ఉందని ఆయన తెలిపారు. ప్రెస్ మీట్ అనంతరం ఐబీ చౌరస్తాలో దీక్ష చేస్తున్న గ్రామకార్యదర్శుల శిబిరంకు వెళ్లి సంఘీభావం తెలిపారు.