అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు

అధికార పార్టీలో భగ్గుమన్న విభేదాలు
  • సీనియర్ నాయకుల తిరుగుబాటుతో పార్టీలో ముసలం
  • శ్రీహరి రావు బాటలో మరికొంతమంది నాయక గణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత కొన్ని సంవత్సరాలుగా అధికార బిఆర్ఎస్ లో అంతర్గతంగా ఉన్న విభేదాలు ఆదివారం రోజున ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన సీనియర్ కార్యకర్త కూచాడి శ్రీహరి రావు రాష్ట్ర మంత్రి, తన ప్రత్యర్థి వర్గం నేత ఇంద్రకరణ్ రెడ్డి పై బాహాటంగా విమర్శలు చేయడం తిరుగుబాటు, బావుటా ఎగురవేయటం పార్టీని ఒక్కసారిగా కుదిపేసింది. నిర్మల్ నియోజకవర్గం లో కొన్నేళ్ల క్రితం దాకా ఇంద్రకరణ్ రెడ్డి, ప్రస్తుతం తిరుగుబాటు ప్రకటించిన కూచాడి శ్రీహరి రావుల మధ్య గురుశిష్య సంబంధం ఉండేది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కనబడేవారు. ఒకరుంటే మరొకరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ పరిస్థితుల నుండి కొన్ని అంతర్గత విభేదాలు వారిద్దరిని కొంత దూరం చేశాయి. అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బిఎస్పి పక్షాన పోటీ పడగా, ఆయనకు ప్రత్యర్థిగా టిఆర్ఎస్ పక్షాన కూచాడి శ్రీహరి రావు బరిలో నిలిచారు. అంతకుముందు ఓటమి చవిచూడడం , రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఇంద్రకరణ్ రెడ్డి పట్ల ప్రజలు సానుభూతి వ్యక్తం చేస్తూ ఆయనకు పట్టం కట్టారు.

అనంతరం ప్రజలకు చేరువవుతూ తన వర్గాన్ని పెంచుకోవడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతకృత్యులయ్యారు. కాగా పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకపోవడం, పార్టీలు మారిన వారికి ప్రాధాన్యత కల్పించడం జరుగుతున్నాయని భావించిన శ్రీహరి రావు వర్గం క్రమంగా స్తబ్దంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డి మరో మారు విజయం సాధించడంతో పార్టీలో ఆయన పట్టు పెరిగి మంత్రివర్గంలో కూడా స్థానం లభించింది. అయితే మంత్రివర్గం లో చేరాక పలు నామినేటెడ్ పోస్టులు, అలాగే పార్టీ పరంగా పోటీ చేయాల్సిన పదవులకు సైతం మంత్రి అనుచరులకే ప్రాధాన్యత లభించడం, శ్రీహరి రావు వర్గంలోని వారికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకపోవడం ఆ వర్గానికి ఆగ్రహం కలిగించింది. ఈ పరిస్థితుల్లో సమయం కోసం వేచి చూస్తున్న ప్రత్యర్థి వర్గం నేత శ్రీహరిరావు తన గళం విప్పారు. ఇంద్రకరణ్ రెడ్డి కి వ్యతిరేకంగా ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆదివారం నిర్మల్ లోని తన నివాసంలో శ్రీహరి రావు ప్రకటన విడుదల చేశారు. పార్టీలో సీనియర్లను కలుపుకొని పోవాలన్న కెసిఆర్ ఆదేశాలు పక్కనపెట్టి అన్ని తానై వ్యవహరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీంతో ఆ పార్టీలో ఏమి చేయలేని అసంతృప్తులు శ్రీహరిరావు తిరుగుబాటుతో తమకు సరైన నాయకుడు దొరికారన్న భావనలో ఉన్నట్లు సమాచారం.

అసంతృప్తులు మద్దతు పలుకుతున్నారు: శ్రీహరి రావు
బహిరంగ ప్రకటన విడుదల చేసిన అనంతరం తిరుగుబాటు నేత సీనియర్ నాయకుడు కే శ్రీహరి రావు "ముద్ర ప్రతినిధి"తో మాట్లాడుతూ పార్టీలో అధినేత కేసీఆర్ ఆదేశాలను పక్కనపెట్టి తమ వారితోనే సమ్మేళనాలు సమావేశాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. తమ వర్గానికి చెందిన కార్యకర్తలు ఇప్పటికి పార్టీ జెండాలు మోస్తున్నారని, అయితే వారిని పట్టించుకోకుండా తన అనుచరులను, తన కొమ్ముకాసే వారిని అందలం ఎక్కించడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీలో చాలామంది మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని, తన ప్రకటన అనంతరం వందలాదిమంది తనకు మద్దతు ప్రకటిస్తూ ఫోన్లు చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో సీనియర్లందరికీ న్యాయం జరిగేలా పార్టీ అధిష్టానం చర్యలు చేపడుతుందని ఆయన వివరించారు.