చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
  • చేనేత రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

రామకృష్ణాపూర్:ముద్ర, తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షుడు వనం సత్యనారాయణ అన్నారు. సోమవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని క్యాతన పల్లి మున్సిపాలిటీ పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ చౌక్ మీదుగా గద్దెరాగడి అమ్మ గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అధ్యక్షుడు వనం సత్యనారాయణ, రాజకీయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వోడ్నాల శ్రీనివాస్ లు మాట్లాడుతూ మానవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పిన చేనేత రంగం కష్టాలు కన్నీళ్ల కలబోత అయిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగం తర్వాత రెండోస్థానాన్ని ఆక్రమించిన చేనేత రంగంలో కనీస వేతనాలు లేవని, కాలాను గుణంగా మార్పులు వస్తున్న కార్మికుల ఆకలి తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగంపై ఆధారపడ్డ సుమారు మూడు లక్షల 80 వేల మంది కార్మికుల భవిష్యత్తు అందాకారంలో పడిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేనేత రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు, హెల్త్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు బొద్దుల మల్లేష్, సభ్యులు బూర సారంగపాణి,లింగయ్య,లక్ష్మణ్,వెంకటస్వామి,ఉపాధ్యక్షులు రాజేశం, సంయుక్త కార్యదర్శి వేముల అశోక్, బండారి రవీందర్, ప్రచార కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.