మహిళల ఛాతీ కొలతలపై హైకోర్టు అసహనం

మహిళల ఛాతీ కొలతలపై హైకోర్టు అసహనం
  • వ్యక్తిగత గోప్యతకు విఘాతం
  • ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలన్న కోర్టు

రాజస్థాన్: సాధారణంగా పోలీసు, అటవీ శాఖ వంటి యూనిఫాం పోస్టుల భర్తీ సమయంలో అభ్యర్థుల శారీరక దృఢత్వ పరీక్షలు రిక్రూట్‌మెంట్ బోర్డులు నిర్వహిస్తూ ఉంటాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎత్తు, బరువు, శారీరక సామర్థ్యాల టెస్ట్‌లు చేస్తారు. ఈ క్రమంలోనే మహిళలకు ఛాతీ కొలతలు తీసుకునే ప్రక్రియ పట్ల రాజస్థాన్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా చేయడం స్త్రీల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించడమేనని పేర్కొంది. వారి వ్యక్తిగత గోప్యతకు కూడా ఇలాంటి చర్యలు తీవ్ర విఘాతమని అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన రాజస్థాన్ ప్రభుత్వం.. శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహించింది. అయితే ఈ పరీక్షల్లో పాస్ కాని ముగ్గురు విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించగా.. ధర్మాసనం ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది.

బాధితురాళ్లు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ దినేశ్ మెహతా ధర్మాసనం.. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు మహిళల ఛాతీ కొలతలు తీసుకునే పద్దతిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి విధానాలు మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించింది. అటవీ శాఖ ఉద్యోగాలకు గానీ, పోలీసు సహా మరే ఇతర ఉద్యోగాలకైనా మహిళా అభ్యర్థులకు ఇలాంటి పరీక్షలు నిర్వహించడం సిగ్గుమాలిన చర్య అని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, రిక్రూట్‌మెంట్ బోర్డుకు రాజస్థాన్ హైకోర్టు ఒక సూచన చేసింది. ఊపిరితిత్తుల పనితీరు, సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా అనేది మెడికల్ ఎక్స్‌పర్ట్స్‌ను అడిగి తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళల ఆత్మాభిమానం, గోప్యతకు సంబంధించి రాజ్యాంగంలోని 14, 21 ఆర్టికల్స్ ఇచ్చిన హక్కులకు.. ఈ చర్య భంగం కలిగించడమే అవుతుందని వెల్లడించింది. అయితే ఊపిరి పీల్చడానికి ముందు, తర్వాత ఛాతీ కొలతల విషయంలో ముగ్గురు అభ్యర్థులు ప్రమాణాలను అందుకోలేకపోయారని ఎయిమ్స్‌ వైద్యుల బోర్డు ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు పరిశీలించింది. దాని ప్రకారం ఆ మహిళా అభ్యర్థులు అనర్హులు అని బోర్డు తీసుకున్న నిర్ణయం సరైందేనన్న కోర్టు.. పరీక్షకు పాటిస్తున్న పద్దతులపై అభ్యంతరం వ్యక్తం చేసింది.