మిలిటెంట్లను వదిలేసిన సైనికులు

మిలిటెంట్లను వదిలేసిన సైనికులు
  • పెద్ద ఎత్తున చుట్టుముట్టిన మహిళలు!

మణిపూర్​: మణిపూర్​ అల్లర్లలో మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్న సైన్యానికి చుక్కెదురైంది. మిలిటెంట్లను విడుదల చేయాలని వేయిమందికిపైగా మహిళలు సైనికులను చుట్టుముట్టారు. దీంతో చేసేదేమీ లేక సైనికాధికారులు ఆ మిలిటెంట్లను విడుదల చేయడం కొసమెరుపు. ఇంఫాల్‌ ఈస్ట్‌లోని ఇథమ్‌లో మిలిటెంట్లు దాక్కున్నారనే సమాచారంతో సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. మహిళలు పెద్ద ఎత్తున ఆర్మీ వాహనాలను చుట్టుముట్టారు. వాహనాలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే తమకు అడ్డుకోవద్దని సైన్యం హెచ్చరించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. కొన్ని గంటలపాటు పరిస్థితి అలాగే కొనసాగడంతో అధికారులు రంగంలోకి దిగారు. పరిస్థితి చేయిదాటిపోకముందే 12 మంది మిలిటెంట్లను వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండానే ఉద్రిక్తపరిస్థితి సద్దుమనిగింది. అనంతరం గ్రామంలో పెద్దసంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రీని సైనికులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే గ్రామస్థులు ఎదురుతిరగడంతో మైటీ వర్గానికి చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌ కంగ్లీ యావోల్‌ కన్నా లుప్‌ సభ్యులు తప్పించుకున్నారు. వారిలో మొయిరంగథెం తంబా కూడా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. అతడు 2015లో 6 డోగ్రా రెజిమెంట్‌పై జరిగిన దాడితో సహా అనేక ఘటనల్లో సూత్రధారి అని పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్రంలో మెయిటీ తెగకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ గత నెల 3న కుకీలు ఆందోళనలకు దిగిన విషయం తెలిసింది. అవికాస్తా హింసాత్మకంగా మారడంతో రాష్ట్రంలో ఇప్పటికీ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం ఆందోళనలను తగ్గించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​సా అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో భిన్న అభిప్రాయాలు వినిపించడం తెలిసిందే.