హిమాచల్​లో ప్రకృతి ప్రకోపానికి మృతులు 300, రూ. 10వేల కోట్ల నష్టం

హిమాచల్​లో ప్రకృతి ప్రకోపానికి మృతులు 300, రూ. 10వేల కోట్ల నష్టం
  • ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు

హిమాచల్​ప్రదేశ్​: ఉత్తర భారత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్‌ భారీ వర్షాలకు చిగురుటాకులా వణికిపోతోంది. వరద నష్టంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు వర్షాలు, వరదలకు 300వందల మంది మృత్యువాత పడినట్లు చెప్పారు. ఆర్థికంగా రూ. 10వేలకోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రకటించారు. ఆ విపత్తు నుంచి బయటపడేందుకు ఏడాది సమయం పడుతుందని తెలిపారు. జూలైలో సంభవించిన వానలు, వరదలు తగ్గకముందే మరోసారి ప్రకృతి విలయతాండవం చేసిందని వాపోయారు. ఇటీవల అక్కడ మరోసారి కుండపోత వర్షాలు, భీకర వరదలు.. వణికించాయి. కొండ చరియలు విరిగిపడి భవనాలు, ఇళ్లు, దేవాలయాలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్ స్థంభాలు నేలకూలాయి. జాతీయ రహదారులు సహా రోడ్లన్నీ కొండ చరియల ధాటికి మూసుకు పోవడంతో రాకపోకలు స్తంభించి.. జనజీవనం ఎక్కడిక్కడ చిక్కుకుపోయింది.

ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు మృతదేహాలు  లభ్యమవుతూనే ఉన్నాయి. విరిగిపడ్డ కొండచరియలు సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందని.. వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను పునర్నిర్మానానికి మరో యేడాది పట్టే అవకాశం ఉందని సాక్షాత్తూ సీఎం వెల్లడించడం గమనార్హం. మరోవైపు.. సిమ్లాలోని సమ్మర్‌ హిల్స్‌లో ఇటీవల ఓ ఆలయంపై కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 30 మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తుండగానే.. మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సహాయక సిబ్బంది చేపట్టిన చర్యలకు ఆటంకం కలుగుతోంది. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. హెలికాప్టర్ల ద్వారా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఏది ఏమైనా మరో వారం రోజులపాటు సహాయక చర్యలు కొనసాగనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అటుపిమ్మట రహదారుల పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తామని ప్రకటించాయి.