అమృతమంటి జలాన్ని కాపాడుకుందాం

అమృతమంటి జలాన్ని కాపాడుకుందాం
  • భూగర్భజలాల పెరుగుదలకు చర్యలు
  • నీటి సంరక్షణకు ‘అటల్ భుజల్ యోజన’
  • ‘జల్​జీవన్​ అభియాన్​’లో ప్రధాని నరేంద్ర మోడీ


రాజస్థాన్​: నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని భవిష్యత్​ తరాలకు ప్రకృతి అందించిన అమృతం నీరని, నీరు ఉంటేనే భవిష్యత్​ ఉంటుందనేది గుర్తుంచుకోవాలని, తద్వారా పంటలు, తిండి అన్ని వనరులు సమకూరుతాయని అలాంటి నీటి కోసం భారతదేశంలో అనేక వేల సంవత్సరాల క్రితమే రుషులు, మునులు ఓ మంచి ప్రణాళికను చేపట్టారని, నీటి కాలుష్యానికి కారకమయ్యే విధానాలకు స్వస్థిపలకాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలోని అబు రోడ్‌లో ‘జల్ జన్ అభియాన్‌’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21వ శతాబ్ధంలో నీటి కొరత తీర్చేందుకు, భవిష్యత్​ తరాలకు సమృద్ధిగా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ‘నల్​సే జల్​’ అన్నారు. నీటి సంరక్షణను కూడా ఓ ఉద్యమంలా చేపట్టాలన్నారు. 


భారత్​లో వేల సంవత్సరాల క్రితమే ప్రకృతి, పర్యావరణం, నీటికి సంబంధించి సంయమనం, సమతుల్య, సున్నితమైన వ్యవస్థను రుషులు, మునులు రూపొందించారన్నారు. మానవాళికి వరప్రదాయిని అయిన నీటి వనరులను నాశనం చేయవద్దని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. జల సంరక్షణ అనేది భారత్​సంస్కృతి, సాంప్రదాయాల్లో భాగమని, అందుకే భారతీయులు నీటిని కూడా భగవంతునితో సమానంగా భావిస్తూ పూజలు చేస్తారని, పండుగలు, వేడుకలు నిర్వహిస్తారన్నారు. భవిష్యత్​ తరాలుగా సమృద్ధిగా నీరు అందించాలంటే నీటి కాలుష్యాన్ని తగ్గించే అవసరం ఉందన్నారు. ఇందులో ప్రభుత్వం తమ వంతు కృషి చేస్తుందని, కానీ ప్రతీ ఒక్క పౌరుడు కూడా కాలుష్య కారకాలను నీటిలో కలవనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొన్ని చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో నీటి కొరత తీవ్రత మనం చూస్తున్నామన్నారు. దీనిపై విచారం వ్యక్తం చేశారు. ‘నమామి గంగే’తో  ఉపనదుల్లన్నింటినీ శుద్ధి చేస్తున్నామన్నారు. నదులు, చెరువులు, బావులు, సరస్సుల ఒడ్డు ప్రాంతంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. దీనివల్ల ఆయా చోట్ల నీటి లభ్యత పెరుగుతుందని, భూమిలో నీటిశాతం ఎక్కువవుతుందన్నారు. 


క్షీణిస్తున్న భూగర్భ జలాలతో తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో భూగర్భ జలాల పెంపునకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ‘ అటల్ భుజల్ యోజన’ ద్వారా దేశంలోని వేలాది గ్రామ పంచాయతీలలో నీటి సంరక్షణను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు. అంతేగాకుండా దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలను నిర్మించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. ముఖ్యంగా నీటి సంరక్షణలో మహిళలు కీలక భూమిక పోషించగలరన్నారు. మహిళలు నీటి కమిటీల ద్వారా ‘జల్ జీవన్ మిషన్’ వంటి ముఖ్యమైన పథకాలకు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. వ్యవసాయంలో నీటి సమతుల్య వినియోగం కోసం దేశం డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను ప్రోత్సహిస్తోందని, వినియోగాన్ని పెంచడంపై రైతులను ప్రోత్సహించాలని అన్నారు.