అగ్నికి ఆహుతైన ఆశలు..!

అగ్నికి ఆహుతైన ఆశలు..!

నిరుపేద కుటుంబాల్లో విషాదం మిగిల్చిన  స్వప్న లోక్ ఘటన 

(కేసముద్రం / గూడూరు- ముద్ర)

తల్లిదండ్రుల రెక్కల కష్టంతో.. చక్కగా చదువుకొన్న పిల్లలు ఉద్యోగంలో స్థిరపడి తమకు ఏ కష్టం లేకుండా కడవరకు అండగా ఉంటారని తలచిన తల్లిదండ్రులకు గురువారం రాత్రి సికింద్రాబాద్ స్వప్న లోక్ అగ్ని ప్రమాద దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. స్వప్న లోక్ అగ్ని ప్రమాద ఘటనలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, గూడూరు మండలాల్లోని ఇంటికన్నె గ్రామానికి చెందిన అమర్రాజు ప్రశాంత్ (23),  ఎర్రగుంట తండా సురేష్ నగర్ కు చెందిన జాటోత్ ప్రమీల (23) దుర్మరణం చెందారు. నిరుపేద కుటుంబాల్లో జన్మించిన ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో చక్కగా చదువుకోవడం గమనార్హం. ప్రమీల పదో తరగతిలో 9.8 గ్రేడ్లతో ఉత్తీర్ణురాలై, ఇంటర్మీడియట్ లో 985 మార్కులు సాధించింది. కోదాడలోని ప్రైవేట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసిన ప్రమీల రెండేళ్లుగా స్వప్న లోక్ కాంప్లెక్స్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తల్లి తండ్రులు బద్రు, బుజ్జి నిరుపేద వ్యవసాయ కూలీలు కావడంతో తమ కూతురుకు తమలాంటి పరిస్థితి ఉండొద్దని రెక్కల కష్టంతో చక్కగా చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ప్రమీల చక్కగా చదువుకొని ఉద్యోగంలో స్థిరపడి ఇక తమకు కష్టం లేకుండా చూస్తుందని ఆశిస్తున్న తరుణంలో అగ్ని ప్రమాద ఘటనలో ఏకైక కుమార్తె ప్రమీలను కబలించడంతో తల్లిదండ్రులు బద్రు బుజ్జి దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఇక ఇంటికన్నె గ్రామానికి చెందిన అమర్రాజు ప్రవీణ్ కు పోలీస్ కావాలనే దృఢ సంకల్పం. ప్రవీణ్ తల్లిదండ్రులు జనార్దన్, ఉపేంద్ర వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఇద్దరు సంతానంలో కుమార్తె వివాహం చేయగా ప్రవీణ్ గత కొంతకాలంగా పోలీసు, సైనిక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నాడు. సైనిక ఉద్యోగం కోసం ఎంపికైనప్పటికీ పరీక్ష రద్దు కావడంతో ఇటీవల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకంలో ఈవెంట్స్ లో నెగ్గి ప్రిలిమ్స్ పరీక్షలో విఫలమయ్యాడు. దీనితో ఉపాధి నిమిత్తం స్వప్న లోక్ కాంప్లెక్స్ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న ఈ కామర్స్ లో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులకు అండగా ఉంటాడనుకున్న ఏకైక కుమారుడు అగ్ని ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఉపేంద్ర, జనార్ధన్ దంపతుల ఆశలపై విషాదం అలుముకుంది. ఎదిగిన పిల్లలు చేతి కందిన దశలో.. అగ్ని ప్రమాద ఘటనలో దుర్మరణం పాలు కావడంతో తమకు ఆవసాన దశలో దిక్కులేని స్థితి ఏర్పడిందని మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఇదిలా ఉండగా ప్రశాంత్ పోలీస్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనతోపాటు ఇంటికన్నె గ్రామానికి చెందిన మరి కొంతమంది యువకులకు దేహదారుడ్య పరీక్షలకు శిక్షణ ఇవ్వగా అందులో అనేకులు పరీక్షలో నెగ్గి ఉద్యోగ అర్హత పరీక్ష మెయిన్స్ కు ఎంపికయ్యేందుకు దోహదపడ్డాడని అలాంటి ప్రశాంత్ అగ్ని ప్రమాద ఘటనలో దుర్మరణం పాలు కావడం పట్ల సహచరుల్లో తీవ్ర విషాదం నెలకొంది