బీజేపీలో చేరిన జక్కా రఘునందన్‌ రెడ్డి 

బీజేపీలో చేరిన జక్కా రఘునందన్‌ రెడ్డి 
  • కందనూలు కమలంలో జోష్
  • బీఆర్ఎస్ లో స్తబ్దత
  • మర్రికి శరాఘాతం
  • ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, మర్రికి పరీక్ష

ముద్ర ప్రతినిధి నాగర్‌కర్నూల్‌ :  నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కీలక నాయకులు, డీసీసీబీ డైరెక్టర్‌ జక్కా రఘునందన్‌ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం ఢిల్లీలో ఎంపీ రాములుతో పాటుగా బీజేపీ జాతీయ నేత తరుణ్ చుగ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ సమక్షంలో పార్టీలో చేరారు. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడి నుంచి బీజేపీలో ఆయన క్రియాశీలకంగా పని చేశారు. 2006-07మధ్యన జడ్చర్ల బీజేపీ ఇంఛార్జ్‌గా, పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. 2009లో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన సొంతూరు నేర్ల్లపల్లికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌ రెడ్డితో పాటుగా బీఆర్‌ఎస్‌లో చేరారు.

2012లో టీడీపీ అభ్యర్థిగా, 2014,2019లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన మర్రి గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ మధ్యకాలంలో జరిగిన అనేక ఎన్నికల్లోనూ జక్కా పాత్ర రాష్ట్రస్థాయి బీఆర్‌ఎస్‌ నాయకులకూ తెలుసు. గత 2019లో తిమ్మాజిపేట సింగిల్‌విండో ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ డీసీసీబీ డైకెక్టర్‌గా పని చేస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జక్కాకు గట్టి పట్టు ఉంది. చాలా మంది జక్కాకు అనుచరులుగా ఉన్నారు. గతంలో పలు పర్యాయాలు మర్రితో విభేదాలు ఏర్పడినా సమసిపోయాయి. బీఆర్‌ఎస్‌, మర్రి గెలుపునకు ఎంతో కృషి చేసినా మర్రి నుంచే అవమానాలు ఎదురయ్యాయన్న ప్రచారం ఉంది. కాగా ఇటీవల కేటీఆర్‌ నాగర్‌కర్నూల్‌లో జరిగిన సమావేశానికి రాగా ఫ్లెక్సీలో ఆయన ఫోటో ఏర్పాటు చేయకపోవడంతో జక్కా తీవ్ర మనస్తాపానికి గురయ్యారని తెలుస్తోంది. అవమానాలను దిగమింగి మర్రి కోసం పని చేస్తున్నా గత పదేళ్లలో జక్కాకు ఎలాంటి ప్రభుత్వ, పార్టీ పదవుల్లోనూ న్యాయం లభించలేదు. జక్కా అనుచరులు ఈ విషయంలో బాధపడుతూ వస్తూ పార్టీ నుంచి బయటికి రావాలని కోరుతున్నా పట్టించుకోలేదు. చివరకు ఇటీవలి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పరాజయం, దేశంలో బీజేపీకి, మోదీకి అనుకూల పరిస్థితులు ఉండటం, అనుచరుల నుంచి ఒత్తిడి అధికం కావడంతో సొంత గూటికి చేరేందుకు జక్కామొగ్గు చూపారు. దీంతో బీజేపీలో జోష్ నెలకొంది.

బీఆర్‌ఎస్‌...మర్రికి శరాఘాతమే

జక్కా రఘునందన్‌ రెడ్డి బీజేపీలో చేరడం ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూల్‌ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీకి, ప్రత్యక్షంగా మర్రి జనార్థన్‌ రెడ్డి శరాఘాతంగా మారనున్నాయి. మర్రి విజయంలో జక్కాదే కీలక భూమిక. మర్రికి కుడి భుజంగా పేరుంది. జక్కా లేనిదే మర్రి లేడని, షాడో ఎమ్మెల్యే అనే ప్రచారాలూ జరిగాయి. ప్రభుత్వ, ఎంజేఆర్‌ ట్రస్టు పేరిట చేపట్టిన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఎన్నో విభేదాలు వచ్చినా మర్రిని ఆయన వీడలేదు.

పార్టీలో పదవులు లభించకున్నా, మర్రి నుంచి సరైన సహకారం లేకున్నా నిబద్ధతతో పని చేసిన జక్కాకు బీఆర్‌ఎస్‌లో అభిమానులు అధికం. బీజేపీలో జక్కా చేరుతున్నారన్న సమాచారం అందడంతో వేలాది మంది మద్దతుదారులు, బీఆర్‌ఎస్‌ మండల, పట్టణ, గ్రామస్థాయి నేతలు ముఖ్యంగా యూత్‌ ఆయనకు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. నీ వెంట నడుస్తామంటూ మద్దతు తెలుపుతున్నారు. జక్కాకు నియోజకవర్గంలోని పలు పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అన్నా...అంటే స్పందిస్తారని, తప్పకుండా చేయూతనిస్తారని పేరుంది. జక్కాకమలం తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్‌ఎస్‌లో సగం ఖాళీ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మర్రి ఓటమి పాలు కావడం, ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించకపోవడం, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే ఉండటంతో బీఆర్‌ఎస్‌లో శ్రేణుల్లో స్తబ్దత నెలకొంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఇమడలేని నేతలు జక్కా వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు త్వరలో జక్కాతో పాటు బీజేపీలో చేరనున్నారు. కాగా జక్కా రాజకీయ వ్యూహం, దూసుకుపోయే తత్వం రాబోయే కాలంలో మర్రికి, ఎమ్మెల్యే రాజేష్‌ రెడ్డిలకు పరీక్షగా మారనుంది.