స్థానికేతరులను తరిమికొట్టాలి

స్థానికేతరులను తరిమికొట్టాలి
  • స్వేచ్ఛకు మారు పేరు కాంగ్రెస్‌
  • బీఆర్‌‌ఎస్‌ ఓ నియంత పార్టీ
  • మోసం చేయడంలో కేసీఆర్‌‌ సిద్ధహస్తుడు
  • రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత ఆయనదే..
  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎంతో మందిని ఏడిపించాడు
  • దాని ప్రతిఫలం అనుభవిస్తున్నడు
  • జనగామ డీసీసీ ప్రెసిడెంట్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: స్థానికేతరులతో జనగామ నియోజవర్గానికి ఎప్పుడూ ముప్పే అని, వారిని ఇక్కడి తరిమి కొట్టి వచ్చే ఎన్నికల్లో స్థానికులకే పట్టం కట్టాలని డీసీసీ జనగామ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. డీసీసీ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా తన నియామకానికి కృషి చేసిన పార్టీ పెద్దలు, హైకమాండ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత బీఆర్ఎస్‌ పాలనలో రాష్ట్రంలో అక్రమాలు, మోసాలు పెరిగిపోయాయన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక జనగామ ఎమ్మెల్యే గురించి వేరే చెప్పనసరం లేదన్నారు. ఎమ్మెల్యేల ఆగడాలతో ప్రజలు విసిగి పోయారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు రెడీగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ మోసకారి..
మాయ మాటలు చెప్పి మోసం చేయడంలో సీఎం కేసీఆర్‌‌ నంబర్‌‌ వన్‌ అని కొమ్మూరి ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయని కేసీఆర్‌‌ ఇప్పడు మళ్లీ కొత్త జిమ్మిక్కులతో ప్రజల ముందుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నాడన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత ఆయకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను విపరీతంగా ప్రోత్సహిస్తూ యువతను తాగుడుకు బానిసలు చేస్తున్నాడని ఆరోపించారు. 2014లో మద్యం ద్వారా రూ.9 వేల కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు అది రూ.40 వేల కోట్లకు పెరిగిందంటే మద్యం అమ్మకాలు ఏ విధంగా ఉన్నయో అర్థం చేసుకోవచ్చన్నారు. మద్యాన్ని ప్రోహించడం సమాజానికి నష్టం చేయడమే అన్నారు. రాష్ట్రంలో ఉన్న బీఆర్‌‌ఎస్‌, దేశంలో ఉన్న బీజేపీ రెండూ ఒక్కటేనని, ఈ పార్టీలను పథకాలపేరుతో మైనార్టీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. 

ఐక్యంగా పనిచేద్దాం..
కాంగ్రెస్‌ పార్టీ ఓ మహా సముద్రమని, అయినా ఇక్కడ ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని కొమ్మూరి చెప్పుకొచ్చారు. తమ పార్టీ హైకమాండ్‌ అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తుందని, చివరకు ప్రజలకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పార్టీ ఉన్న సీనియర్‌‌, జూనియర్‌‌ నేతలంతా తనకు ఒక్కటేనని, ఇన్ని రోజులు ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం అందరినీ కలుపు ఐక్యంగా పనిచేస్తామని, రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న జిల్లా, మండల, గ్రామ కమిటీలన్ని రద్దు చేస్తున్నామని, పది రోజుల్లో అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను వేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు.  

‘ముత్తిరెడ్డి’ చేసిన తప్పులు ఒప్పుకో..
నాయకుడంటే విలువలతో ఉండాలని, అందితే జుట్టు లేదంట కాళ్లు పట్టుకోవద్దని కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి సూచించారు. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరిస్థితి ఎవరికీ రావద్దన్నారు. కన్న కూతురు, సొంత పార్టీ నాయకులు ఆయనను ఛీకొడుతున్నారని, ఆయన చేతకానితనం వల్లే నేడు టికెట్‌ కోసం ఏడుస్తున్నాడని విమర్శించారు. ముత్తిరెడ్డి ఎమ్మెల్యేగా ఈ పదేళ్లలో ఎంతో మందిని ఏడిపించాడని, దాని ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడని కొమ్మూరి ఎద్దేవా చేశారు. ముత్తిరెడ్డి ఆయన క్యారెక్టర్‌‌ లాగే అందరూ ఉంటారని అనుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా ముత్తిరెడ్డి చేసిన తప్పులు ఒప్పుకుని శిక్ష అనుభవించాని హితవుపలికారు. సమావేశంలో సమావేశంలో పార్టీ సీనియర్‌‌ లీడర్లు బొట్ల నర్సింగారావు, జిల్లెల్ల సిద్దారెడ్డి, ఉడత రవి యాదవ్, మాజీ  కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ లీడర్లు బనుక శివరాజ్ యాదవ్, మాజీ ఎంపీపీ ధర్మ గోవర్దన్ రెడ్డి, మోటే శ్రీనివాస్, ఆలేటి సిద్ది రాములు, లింగాల నర్సిరెడ్డి, నూకల బాల్ రెడ్డి, బండారు శ్రీనివాస్, జాయ మల్లేష్, మోర్తాల ప్రభాకర్, ముచ్చల రాజిరెడ్డి, దాసరి క్రాంతి, బిర్రు సత్యనారాయణ, పిట్టల సతీష్.. తదితరులు పాల్గొన్నారు.