విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోంది..

విద్యా వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం  భ్రష్టుపట్టిస్తోంది..
  • కార్పొరేట్ కళాశాలలు ఉన్నది చదువుకునేందుకా.. చంపడానికా..
  • శ్రీ చైతన్య జూనియర్ కళాశాల సందర్శనలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
  • ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం..
  • కళాశాల యజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలంటూ దీక్ష..

ముద్ర, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న దొరల పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని, కార్పొరేట్ కళాశాలల యజమాన్యాల ఒత్తిళ్లకు విద్యార్థుల బంగారు భవిష్యత్తు బలవుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. కళాశాల యజమాన్యం పోలీసులు బయట గేటుకు తాళాలు వేసి లోపల కూర్చోవడంతో గేటు ఎదుట బైఠాయించి అందరు బయటికి రావాలని సూచించారు. ఎంపీ రాకతో అప్రమత్తమైన పోలీసులు గేటు వద్దకు వచ్చి లోపలికి ఎవరికి అనుమతి లేదని సమాధానం ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ ఒక ప్రజా ప్రతినిధి కళాశాల సందర్శనకు వస్తే అనుమతించకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. తాను కచ్చితంగా కళాశాలను సందర్శించి తీరాలని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో చేసేదిలేక పోలీసులు ఎంపీని లోపలికి అనుమతించారు. కళాశాల యజమానియంతోపాటు స్థానికంగా అందుబాటులో ఉన్న విద్యార్థులను వివరాల్ అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు విద్యా పేరిట దోపిడీ విధానాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

కళాశాల ర్యాంకుల విషయంలో విద్యార్థులను తీవ్ర మనోవేదనకు, ఒత్తిడికి గురి చేస్తుంటే, కొడుతుంటే ఈ వ్యవస్థ పై చర్యలు చేపట్టాల్సిన విద్యాశాఖ అధికారులు చూసి చూడకుండా ఉంటున్నారన్నారు. విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అనేక ప్రైవేట్ కళాశాలలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా చర్యలు తీసుకొని వదిలివేస్తున్నారని విమర్శించారు. సాత్విక్ కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. వెంటనే శ్రీ చైతన్య జూనియర్ కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల యజమాన్య వేధింపుల కారణంగానే ఓ నిండు ప్రాణం బలైందని, బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు ఊరుకునేది లేదన్నారు. శ్రీ చైతన్య నారాయణ వంటి కార్పోరేట్ కళాశాలలో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. లక్షల రూపాయల ఫీజులను వసూలు చేసే యజమాన్యాలు విద్యార్థుల ప్రాణాలు బలిగొనడం ఏమిటని ప్రశ్నించారు. సాత్విక మృతికి కారణమైన కాలేజీ యాజమాన్యంలో తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల ఆవరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్సింగి ఏసిపి రమణగౌడ్ ఎంపీతో చర్చలు జరిపారు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.