ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి: నాగం
- మార్కండేయ ప్రాజెక్టు నుంచి నీళ్లొస్తుంటే సంతోషమేసింది
- వాస్తవానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో
- ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తీరుపై మండిపడిన మాజీ మంత్రి డా. నాగం జనార్ధన్ రెడ్డి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : మార్కండేయ ఎత్తిపోతల పథకం నుంచి నీళ్లు దుంకుతుంటే చాలా సంతోషమేసిందని.. నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ఎంతో మేలు జరగనుందని మాజీ మంత్రి డా. నాగం జనార్ధన్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. మార్కండేయ ప్రాజెక్టు ద్వారా 8 వేల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. బీడు భూములకు నీళ్లు అందిస్తానని ప్రజలకు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. ఆదివారం జరిగే ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ప్రతి ఓటరును కోరుతున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూల్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివిధ అంశాలపై నాగం మాట్లాడారు.
ప్రాంతీయ పార్టీలతోనే సుస్థిర ప్రభుత్వం..
ప్రాంతీయ పార్టీలతోనే సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ పార్టీలకే ప్రజలు ఓటేస్తారని డా. నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వలసదారులతో నిండిపోయిందని.. ఆ పార్టీ పునాది లేని ఇంటితో సమానమని పోల్చారు. ఓట్లు దన్నుకోవడానికి, ఒక ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేయడానికి మాత్రమే కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఉందని నాగం విమర్శించారు.
ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిపై మండిపాటు..
ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిలకడ లేని మనిషి అని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకుండా షుష్క వాగ్దానాలు చేస్తున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటేయాలని దామోదర్ రెడ్డి కోరడం నైతికమా? అని ప్రశ్నించారు. ఎన్నికల ఖర్చులకు ఏ కాంట్రాక్టరు డబ్బులిస్తున్నాడని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని నాగం ఖండించారు. ఆనాడు గిరిజన నాయకుడిపై దాడి జరిగినప్పుడు తండ్రీ కొడుకులు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అలాంటి వారికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే న్యాయం కాని తాను బాధితులకు మద్దతుగా నిలవడం అన్యాయమా? అంటూ ప్రశ్నించారు. పైగా, నాగం మద్దతు తమకు ఉందంటూ ప్రజల్లో దుష్ర్పచారం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను ఎన్నడూ వారికి మద్దతు ప్రకటించలేదని నాగం స్పష్టం చేశారు. ఒకరకంగా దామోదర్ రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.