మన ఊరు మనబడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

మన ఊరు మనబడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

జెడ్పి సీఈవో వెంకట శైలేష్
పెద్ద శంకరంపేట, ముద్ర: మన ఊరు - మనబడిలో ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మెదక్ జిల్లా జెడ్పి సీఈవో వెంకట శైలేష్ అన్నారు.  శుక్రవారం పెద్దశంకరంపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో డిపిఓ సాయిబాబా, మండల ప్రత్యేక అధికారి రవి ప్రసాద్, ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేట, రేగోడు, మండలాల మన ఊరు- మనబడి పథకం కింద ఎంపికైన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సర్పంచులు, విద్యా కమిటీ చైర్మన్ లతో, నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.  పాఠశాల వారీగా ఆయా పాఠశాలల్లో ఇప్పటివరకు జరిగిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను అడిగి సమీక్ష సమావేశంలో తెలుసుకున్నారు. పెద్ద శంకరంపేట మండలంలో 16 పాఠశాలలు మన ఊరు -మన బడి పథకం కింద ఎంపికయ్యాయని,  ఆయా పాఠశాలలో తొందరగా మరుగుదొడ్లు, కరెంటు పనులు, ట్యాంకు ద్వారా నీటి సరఫరా తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ అధికారుల పనితీరు సరిగా లేదని, పనులు జరుగుతున్న సమయంలో ఆయా ప్రదేశాలకు వచ్చి చూడడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు అధికారులకు విన్నవించుకున్నారు. పంచాయతీ రాజ్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. తాము చేసిన పనులకు ఇప్పటివరకు బిల్లులు రావడం లేదని దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన జడ్పీ సీఈఓ బిల్లులు తొందరగానే వస్తాయని, పనులను ఈ నెల 31వ తేదీ లోపు పూర్తిచేసి పాఠశాల ప్రారంభమయ్యే లోపు అన్ని పనులు పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పేట  ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా, మండల విద్యాధికారి బుచ్చానాయక్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, మండల రైతు బంధు అధ్యక్షుడు సురేష్ గౌడ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యా కమిటీ చైర్మన్ లు, ఆయా గ్రామాల సర్పంచులు,  పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.