ప్రధానికి పాలమూరుపై పగ

ప్రధానికి పాలమూరుపై పగ
  •  చిత్తశుద్ధి ఉంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలి
  • బిఆర్ఎస్ వి స్కీములు - కాంగ్రెస్ వి స్కాములు
  • కాంగ్రెస్ కే వారంటీ లేదు - వారి గ్యారెంటీలకు విలువేది
  •  వనపర్తి బహిరంగ సభలో బిజెపి, కాంగ్రెస్ లపై మంత్రి కేటీఆర్ ఫైర్

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి :  పాలమూరు పై పగబట్టిన ప్రధాని మోడీ జిల్లాకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నాడో ప్రజలకు చెప్పాలని, ప్రధానికి ఈ ప్రాంత ప్రజలపై నిజంగా ప్రేమ ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ప్రకటించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిఆర్ఎస్ వి స్కీములు అని, కాంగ్రెస్ వి స్కాములని, కాంగ్రెస్ అంటే కన్నీళ్ళని బీఆర్ఎస్ అంటే సాగునీళ్ళని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటే మైగ్రేషన్ బి ఆర్ ఎస్ అంటే ఇరిగేషన్ అని కాంగ్రెస్ పార్టీ వి వారంటీ లేని గ్యారెంటీలని, ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను ఎవరు నమ్ముతారని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్ నమ్ముకుని ఓటేస్తే 24 గంటల కరెంటు పోయి మూడు గంటల కరెంటు రావడం ఖాయమన్నారు. నల్ల నీళ్లు బందై నీళ్ల కోసం బిందెల యుద్ధం మొదలవుతుందన్నారు. కృష్ణానది చెంతనే ఉన్న పాలమూరు జిల్లాకు సాగునీరు లేక వ్యవసాయ పొలాలు నెర్రెలు పారాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకే ఈ ప్రాంతానికి సాగునీరు లభించిందని కేటీఆర్ అన్నారు. వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా ఇవ్వాలని రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే, కేంద్రంలో మన ప్రమేయంతోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయి గులాబీ జెండా ఎగిరేసే వరకు పాలమూరును పట్టించుకోలేదన్నారు. జిల్లాను దత్తత తీసుకున్న వారు కూడా దగా చేశారని విమర్శించారు.

జిల్లా నుండి 14 లక్షల మంది వలస పోతుంటే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలేదన్నారు. నది పక్కన నేలలున్న ఏ ప్రభుత్వం కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ఆర్డీఎస్ తూములను పగలగొట్టి దౌర్జన్యంగా నీళ్లు తీసుకుపోతున్న ఈ ప్రాంత నాయకులు పట్టించుకోలేదని చెప్పారు. అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే హారతులు ఇచ్చి పంపింది ఈ దగుల్బాజీ కాంగ్రెస్ నేతలు కాదా అని ఆయన ప్రశ్నించారు. రైతులను ఆదుకొని రైతుబంధుతో అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం అని, ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కెసిఆర్దేనని, ఆడపిల్లల పెళ్లికి రూ. లక్ష 116 లు ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. రైతు బీమా పథకం కింద వనపర్తి జిల్లాలో 1400 మంది రైతులకు రూపాయలు ఐదు లక్షల సహాయం అందింది అన్నారు. 11 సార్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ సమస్యల గురించి మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నారు. వస్తదో రాదో తెలియని తెలంగాణ కోసం కొట్లాడిన చరిత్ర టిఆర్ఎస్ దని అన్నారు. పదవుల కోసం కాదు ప్రాంత సమస్యల పరిష్కారానికి కొట్లాడామని చెప్పారు. మంత్రి పదవి ఆశించి ఆనాడు పోరాటాలు చేయలేదన్నారు. వనపర్తికి 1,25,000 ఎకరాలకు సాగునీరు అందాయంటే అది నిరంజన్ రెడ్డి ఘనతయని కేసీఆర్ ఆశీస్సుల వల్లే సాధ్యమైందని ఆయన వివరించారు. డిగ్రీ జూనియర్ కళాశాల కోసం ధర్నాలు చేసే స్థితి నుండి వనపర్తికి మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలలు వచ్చాయని గర్వంగా గల్లా ఎగరేసి చెప్పే అంశం అని అన్నారు.

1080 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణమైందని, వనపర్తి జిల్లా చేసి కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలను నిర్మించారని, పీర్లగుట్టలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు బంజారాహిల్స్ ను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. వనపర్తి లో 3280 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారని చెప్పారు. ఐటిఐ కేజీబీవీ వ్యవసాయ డిగ్రీ కళాశాలలో నిర్మించామన్నారు. ఇంటి పెద్దల నిరంజన్ రెడ్డి వనపర్తి అభివృద్ధిని చేస్తున్నారని అన్నారు. 65 ఏళ్లలో చేయని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామన్నారు. కెసిఆర్ కుడి భుజంలా ఉన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ జెండా ఎత్తి గ్రామ గ్రామీణ తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారని కితాబు ఇచ్చారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. సిరిసిల్ల సిద్దిపేట మాదిరిగా అత్యధిక మెజారిటీతో నిరంజన్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందని చెప్పారు.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల తో పోటీపడి వనపర్తిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతగా అభివృద్ధి చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వనపర్తిలో అనూహ్యమైన అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఐటీ టవర్ నిర్మాణానికి జీవో విడుదల చేసిన కేటీఆర్ కు ఆయన ధన్యవాదాలు చెప్పారు.  75 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన తర్వాతే నామినేషన్ వేస్తానని ప్రజలకు మాట ఇచ్చానని, అది నిలబెట్టుకొని నామినేషన్ వేశానని చెప్పారు. 1,25,000 ఎకరాలకు సాగునీళ్ళు తీసుకొచ్చాను అని అన్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.