తుంగతుర్తి క్లస్టర్ పరిధిలోని 6 మండలాల్లో సాగుతున్న ఆయిల్ ఫామ్ తోటలు

తుంగతుర్తి క్లస్టర్ పరిధిలోని 6 మండలాల్లో సాగుతున్న ఆయిల్ ఫామ్ తోటలు
  • ఏపుగా పెరుగుతున్న ఆయిల్ ఫామ్ తోటలు
  • వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేయాలంటున్న ఉద్యానవన శాఖ అధికారిని స్రవంతి

తుంగతుర్తి ముద్ర:-వ్యవసాయ రంగంలో పెను మార్పులు తేవడానికి కేంద్ర  రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ తోటలు పెంపకం పై రైతులకు అవగాహన కల్పించడంతో తుంగతుర్తి ప్రాంతంలో చాలామంది రైతులు ఆయిల్ ఫామ్ తోటల పెంపకం పట్ల దృష్టి సారించారు. తుంగతుర్తి క్లస్టర్ పరిధిలో  ఆరు మండలాల్లో సుమారు 1196 ఎకరాల ఆయిల్ ఫామ్ తోటలు సాగవుతున్నాయని ఉద్యాన ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు .తుంగతుర్తి మండల పరిధిలో 327 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడం కోసం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ సాగుచేసిన రైతులకు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలను వివరిస్తూ రైతులను ఆయిల్ ఫామ్ తోటలు పెంపకం వైపు దృష్టి సారించేలా అధికారులు కృషి చేస్తున్నారు .

ఈ సందర్భంగా తుంగతుర్తి క్లస్టర్ ఉద్యానవన శాఖ అధికారి వి. స్రవంతి మాట్లాడుతూ తుంగతుర్తి క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగవుతుందని రైతులకు సబ్సిడీపై డ్రిప్ అలాగే మొక్కలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఓసి రైతులకు 80% రాయితీపై డ్రిప్పు ,బీసీలకు 90%, రాయితీ ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీపై డ్రిప్ సౌకర్యం ఒక ఎకరాకు అందిస్తున్నామని తెలిపారు. ఒక్కోమొక్కకు 193 రూపాయలవుతుందని రైతు మాత్రం 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఒక ఎకరాకు 57 మొక్కలు అవసరమవుతాయని తెలిపారు .డ్రిప్ సౌకర్యం ఒక రైతుకు 12:30 ఎకరాల వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసినట్లయితే రైతు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు సంవత్సరానికి 2,100 రూపాయలను ఎరువుల వాడటానికి అలాగే అంతర్ పంట సాగు చేసినట్లయితే మరో రెండు వేల ఒక వంద రూపాయలను ప్రభుత్వం ఇస్తుందని స్రవంతి తెలిపారు.

ఆయిల్ ఫామ్ తోటలు నాలుగు సంవత్సరాల నుండి కాపులోకి వస్తాయని మొదటగా ఐదు నుండి ఏడు టన్నుల దిగుబడి వస్తుందని ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత 12 టన్నుల నుండి 15 టన్నుల వరకు దిగుబడి ఉంటుందని ఆమె తెలిపారు. తుంగతుర్తి క్లస్టర్ పరిధిలో పతంజలి కంపెనీ వారు ఆయిల్ ఫామ్ మొక్కలను సరఫరా చేశారని పంట వచ్చిన తర్వాత కొనుగోలు కూడా పతాంజలి వారు చేస్తారని ఆమె తెలిపారు. ప్రస్తుత మార్కెట్లో ఆయిల్ ఫామ్ ధర టన్ను పన్నెండు వేల రూపాయల వరకు ఉందని నెలనెలా ధరలు మారుతుంటాయని స్రవంతి తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థిక లాభం పొందవచ్చని ప్రభుత్వం ఇస్తున్న రాయితీలను ఉపయోగించుకునీ రైతులు ఆయిల్ ఫామ్ పై దృష్టి సారించాలని ఆమె కోరారు .ఇప్పటివరకు తుంగతుర్తి క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో సాగుచేసిన ఆయిల్ ఫామ్ తోటలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని ఏపుగా పెరుగుతున్నాయని తాము కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఫీల్డ్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుందని స్రవంతి తెలిపారు .రైతులు ఇంకా ఆయిల్ ఫామ్ తోటల సాగు ముందుకు రావాలని ఆమె కోరారు.