మాది ఇరిగేషన్ పాలన

మాది ఇరిగేషన్ పాలన
  • కాంగ్రెస్ ది మైగ్రేషన్ పాలన
  • కాంగ్రెస్ గెలుపు పగటి కల
  • ఎన్నికల తర్వాత బిజెపి దుకాణం బంద్
  •  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కెసిఆర్ ప్రభుత్వ హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలే చెబుతారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సమావేశాలు నిర్వహిస్తే కనీసం 500 మంది కూడా రాని కాంగ్రెస్ గెలుపు కలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత బిజెపి దుకాణం బంద్ కాక తప్పదని ఆయన పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో ఆదివారం జరిగిన భారాస కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2001 లో అన్నిటికీ కరువైన పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించే  స్థాయికి ఎదిగామన్నారు.సీనియర్ ఉద్యమ నాయకుల గడ్డ ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 44 డిగ్రీల ఎండ లోనూ పెద్ద ఎత్తున జనం రావటమే బీఆర్ఎస్ బలానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి పెట్టిన సమావేశానికి 500 మంది కూడా రాలేదని,అయినా కాంగ్రెస్ వాళ్లు గెలుస్తామని కలలు కంటున్నారనీ ఎద్దేవా చేశారు.

అయితే కాంగ్రెస్ కు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో అభ్యర్థులే దిక్కు లేరని ఎత్తి పొడిచారు.తెలంగాణ వస్తే ఏమొచ్చిందని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నాయని, తెలంగాణ వస్తే ఏమొచ్చిందో ఏ పల్లెనడిగినా చెబుతుందన్నారు. తెలంగాణలో నీళ్ళు పుష్కలంగా ఉన్నాయని,డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్ర లో మంచి నీళ్ళు పది రోజులకోసారి వస్తాయని అన్నారు. గుజరాత్ లో మహిళల పెళ్లికి కేవలం రూ.12 వేలిస్తే, ఇక్కడ కల్యాణ లక్ష్మి కింద రూ.1,00,116 ఇస్తున్నామని చెప్పారు. తమది ఇరిగేషన్ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ది మైగ్రేషన్ ప్రభుత్వం అన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతుంది తప్ప అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో ప్రతి పక్షాలు ప్రకృతి వైపరీత్యాల కన్నా దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ దుకాణం బంద్ అయినట్టే కనిపిస్తోందన్నారు. బీజేపీ కి డిపాజిట్లు కూడా దక్కేట్టు లేవు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.