చెన్నైకి ప్రధాని మోదీ.. 

చెన్నైకి ప్రధాని మోదీ.. 
  • ‘ఖేలో ఇండియా’ ప్రారంభోత్సవానికి హాజరు 
  • 3 రోజుల పాటు తమిళనాడు పర్యటన 
  • శ్రీరంగం ఆలయంలో  ‘స్వచ్ఛ్‌ తీర్థ్‌’
  • కార్యక్రమంలో పాల్గొననున్న  ప్రధాని 

చెన్నై:ప్రధానమంత్రి నరేంద్రమోదీ  నేడు చెన్నైకి రానున్నారు. మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరుగనున్న నేపథ్యంలో ఆయన దేశవ్యాప్తంగా సుప్రసిద్ధ ఆలయాలకు వెళ్లి ఆయా ప్రాంతాల్లోని నదులు, తీర్థాల నుంచి పవిత్ర జలాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 19వ తేదీ సాయంత్రం 4.50 గంటలకు మోదీ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి విచ్చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మెరీనా బీచ్‌ నేపియర్‌ బ్రిడ్జి సమీపంలోని అడయార్‌ ఐఎన్‌ఎస్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో నెహ్రూ స్టేడియానికి చేరుకుంటారు. ఆ స్టేడియంలో ‘ఖేలో ఇండియా’ పోటీలను ఆయన ప్రారంభించనున్నారు. చెన్నై, మదురై, తిరుచ్చి, కోయంబత్తూరు నగరాల్లో ఈ పోటీలు ఈనెల 19 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో 18 యేళ్లలోపు క్రీడాకారులు ఆరువేల మందికిపైగా పాల్గొంటున్నారు. ఈ క్రీడల ప్రారంభోత్సవాల్లో ప్రధానితోపాటు గవర్నర్‌రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌, రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి తదితరులు పాల్గొంటారు. సాయంత్రం 7.30 గంటలకు ఈ వేడుకలు పూర్తయ్యాక ప్రధాని మోదీ కారులో గిండిలోని రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, పార్టీ సీనియర్‌ నేతలతో ఆయన భేటీ అవుతారు. 

20న శ్రీరంగంలో పర్యటన...

ఈనెల 19వ తేది రాత్రి ప్రధాని మోదీ రాజ్‌భవన్‌లోనే బసచేస్తారు. మరుసటి రోజు శ్రీరంగానికి బయలుదేరి వెళతారు. రాజ్‌భవన్‌ నుంచి కారులో ఉదయం 9.25 గంటలకు మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో తిరుచ్చికి చేరుకుంటారు. తిరుచ్చి నుంచి కారులో శ్రీరంగం ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ ఆలయ పరిసరాల్లో ‘స్వచ్ఛ్‌ తీర్థ్‌’ పేరుతో పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ఆలయ పరిసరాలను శుభ్రం చేయనున్నారు. శ్రీరంగం ఆలయంలో ఆయన ఉదయం 11 నుంచి 12.40 గంటలవరకు ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2.10 గంటలకు రామేశ్వరానికి బయలుదేరి వెళతారు. రామేశ్వరం రామనాధస్వామివారి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆలయ పరిసరాలను శుభ్రం చేయనున్నారు. ఆ రోజు రాత్రి రామేశ్వరంలోని శ్రీరామకృష్ణ మఠంలో బస చేయనున్నారు. ఈ నెల 21 ఉదయం రామేశ్వరం అగ్నితీర్థం కడలిలో స్నానమాచరిస్తారు. మళ్లీ రామనాథస్వామి సేవలో పాల్గొంటారు. అక్కడ ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత కారులో అరిచల్‌ మునై ప్రాంతానికి వెళతారు. ఉదయం 10.25 గంటలకు అక్కడి కోదండ రామాలయాన్ని సందర్శిస్తారు. ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 11.25 గంటల వరకు ఆలయంలోనే గడుపుతారు. అటు పిమ్మట అయోధ్య రామాలయం కోసం సముద్రంలో తీర్థ జలాలను సేకరించనున్నారు. ఇలా ఆలయాలలో సేకరించిన పవిత్ర జలాల కలశాలతో ఆయన హెలికాప్టర్‌లో మదురై విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు.