అదానీ డౌన్​.... అంబానీ అప్​! | Mudra News

అదానీ డౌన్​.... అంబానీ అప్​! | Mudra News

న్యూఢిల్లీ: భారత్ దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కొద్ది రోజులుగా ప్రపంచ కుబేరుల జాబితాలో వెనకంజలో ఉండగా.. ఇప్పుడు ఒక్కసారే లాంగ్ జంప్ చేశారు. ఫోర్బ్స్ బిలియనీర్ వరల్డ్ రిచ్ లిస్ట్‌లో టాప్ 10లోకి దూసుకొచ్చారు. ఆయన సంపద ఒక్కసారిగా పెరగడంతో తన స్థానాలను మెరుగుపరుచుకున్నారు. గౌతమ్ అదానీ భారీగా నష్టపోయిన నేపథ్యంలో ప్రస్తుతం కుబేరుల జాబితా టాప్ 10 ఉన్న ఏకైక వ్యక్తిగా నిలిచారు. గురువారం ఆయన సంపద 1.6 బిలియన్ డాలర్లు పెరిగి 83.2 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో టాప్ 10లోకి దూసుకొచ్చారు. హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా నష్టపోయిన గౌతమ్ అదానీ టాప్ 10 నుంచి దిగజారిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం భారత్ నుంచి టాప్ 10లో ఉన్నది ఒక్క ముకేశ్ అంబానీ మాత్రమే కావడం గమనార్హం.


రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ నెట్ వర్త్ గడిచిన 24 గంటల్లో సుమారు 1.7 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన సంపద మొత్తం 83. 2 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల లిస్ట్‌లో 12 వ స్థానం నుంచి టాప్ 10 లోకి తిరిగి అడుగు పెట్టారు. ముకేశ్ అంబానీ ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఇటీవలే గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి తన స్థానాన్ని తిరిగి సాధించుకున్నారు. మరోవైపు.. ప్రపంచ ధనవంతుల జాబితాలో టాప్ 10లో సైతం ఆయన ఒక్కరే ఉన్నారు. ప్రస్తుతం గౌతమ్ అదానీ 17వ స్థానంలో ఉన్నారు.


ముకేశ్ అంబానీ నెట్ వర్త్ ఛార్ట్ చూసుకున్నట్లయితే.. 2018 నుంచి ప్రతి ఏటా ఆయన సంపద భారీగా పెరుగుతూ వస్తోంది. 2018లో ఆయన సంపద రూ.3.3 లక్షల కోట్లు కాగా.. అది 2019 నాటికి 4.1 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. 2020లో అంబానీ సంపద రూ.7 లక్షల కోట్లకు ఎగబాకింది. ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ సంపద 2022లో మొత్తంగా రూ.7.48 లక్షల కోట్లకు చేరింది.