మారువేషంలో అమృత్​పాల్​ సింగ్​

మారువేషంలో అమృత్​పాల్​ సింగ్​

ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్‌పాల్ సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పంజాబ్ పోలీసుల వేట కొనసాగుతోంది. గత శనివారం నుంచి అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అతడు అనేక వేషాలు మారుస్తూ, పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్నాడు. తాజాగా అతడు మారు వేషంలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది. పాటియాలాలో అతడు సంప్రదాయ దుస్తులు వదిలేసి, ట్రెండీ జాకెట్, కళ్లద్దాలు ధరించి కొత్తగా తయారయ్యాడు. రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. ఇది ఈ నెల 19న రికార్డైన వీడియో.

కాగా, అమృత్‌పాల్ సింగ్ కోసం పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అన్ని రకాలుగా పరిశీలిస్తున్నప్పటికీ, అతడు ఎక్కడున్నాడు అనేదానికి సంబంధించి ఎలాంటి ఆధారం కూడా దొరకలేదు. అమృత్‌సర్ నుంచి కురుక్షేత్ర, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం ఒక బస్ టెర్మినల్ వద్ద అతడు కనిపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ-పంజాబ్‌ను కలిపే ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ పరిసరాల్లో పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు. తాజాగా లభ్యమైన సీసీ కెమెరాల్లో అతడు ఒక మహిళతోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చి పారిపోయాడు. ఆ మహిళ అతడికి ఆశ్రయం ఇచ్చింది. అమృత్‌పాల్ సింగ్ తన ముఖం కనిపించకుండా గొడుగు అడ్డం పెట్టుకున్నాడు. హరియాణాలో అతడికి ఆశ్రయం ఇచ్చిన బల్జీత్ కౌర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అమృత్‌పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులతోపాటు ఢిల్లీ పోలీసులు కూడా వెతుకుతున్నారు.