ఇక అధిక పింఛను హుష్​కాకేనా?

ఇక అధిక పింఛను హుష్​కాకేనా?
  • ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మకుల ఆశలపై
  • నీళ్లు చల్లిన ఈపీఎఫ్​వో !
  • సుప్రీం తీర్పునకు విరుద్ధంగా గండికొట్టే ప్రయత్నం
  • ఈపీఎఫ్​వో 26(6)పేరా పేరిట మెలిక

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌వో రెండు నాల్కల ధోరణితో చందాదార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవసరం లేదనుకున్న నిబంధనను తెర పైకి తెచ్చి ఉద్యోగులను, పెన్షనర్లను ఇబ్బందుల పాలు చేస్తున్నారు, వారి ఆశయాలపై నీళ్లు చల్లుతున్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అధిక పెన్షన్‌ పొందేందుకు, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వడానికి మరోసారి అవకాశం కల్పించిన ఈపీఎఫ్​వో 26(6) పేరా పేరిట ఒక కొత్త మెలిక పెట్టింది. తద్వారా, చాలా ఎక్కువ మందిని అధిక పెన్షన్‌కు అనర్హులుగా మార్చేందుకు చూస్తోంది. ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తుంటే, అధిక వేతనంపై చందా చెల్లించేందుకు ఈపీఎఫ్​ చట్టంలోని పేరా 26(6) కింద ఉద్యోగి -యజమాని సంయుక్తంగా ఈపీఎఫ్​వో అనుమతి పొందారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. వాస్తవానికి, అధిక వేతనంపై చందా చెల్లింపు కోసం 26(6) కింద చాలా మంది ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేదు. అసలు చాలా మందికి ఈ సంగతి కూడా తెలీదు. ఈ కాలమ్‌లో సంబంధిత వివరాలు నమోదు చేసి, ఆధారాన్ని జత చేస్తేనే దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగుతోంది, లేదంటే అక్కడితో ఆగిపోతోంది.

ఈపీఎఫ్​వో చట్టంలోని రూల్స్‌ ప్రకారం... గరిష్ట పరిమితికి మించి వేతనం పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యజమాన్యాలు కలిసి, వాస్తవ వేతనం (వాస్తవిక మూల వేతనం + డీఏ) మీద 12 శాతం చొప్పున చందా చెల్లించేందుకు ఈపీఎఫ్​వో పేరా 26(6) కింద దరఖాస్తు చేసుకోవాలి. అధిక వేతనంపై చందా చెల్లించడానికి ఉద్యోగి, యజమాని ఉమ్మడిగా అంగీకరిస్తున్నామని, ఇందుకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామని చెబుతూ అప్లికేషన్‌ పెట్టుకోవాలి, అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇలాంటి అనుమతి పొందిన వాళ్లనే, ఇప్పుడు అధిక పెన్షన్‌ పొందేందుకు అర్హులుగా ఈపీఎఫ్​వో నిర్ణయిస్తోంది. మిగిలినవాళ్లను అనర్హులుగా చూస్తోంది. ఒక విధంగా, సుప్రీంకోర్టు తీర్పునకు గండి కొట్టే ప్రయత్నం చేస్తోంది.

వాస్తవిక వేతనంపై ఏళ్ల తరబడి ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం చందా చెల్లించినప్పుడు అంగీకరించి, దాని మీద ఫీజులు వసూలు చేసి, ఈపీఎఫ్​మొత్తంపై వడ్డీ కూడా చెల్లించిన ఈపీఎఫ్​వో, 26(6) పేరా కింద అనుమతి ఉందా అని ఇప్పుడు ప్రశ్నించడమేంటని ఉద్యోగులు, పింఛనుదార్లు ప్రశ్నిస్తున్నారు. పోనీ ఇప్పుడు ఆ ఆప్షన్‌ ఇద్దామన్నా అవకాశం లేదు. దీంతో.. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేస్తున్న, చేసిన లక్షలాది మంది ఈపీఎఫ్​వో వైఖరి వల్ల అధిక పింఛను అవకాశం కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. 

2017 మార్చి 23న, 2019 జనవరి 22న ఇచ్చిన ఆదేశాల్లో... 26(6) పేరా కింద అధిక వేతనంపై చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రాంతీయ కమిషనర్లకు ఈపీఎఫ్​వో సూచించింది. ఇప్పుడు మాత్రం ఈ ఆప్షన్‌ ఇచ్చి ఉండాలన్న నిబంధన పెట్టి ఇబ్బందులు పెడుతోంది. అర్హులైన వారి సంఖ్యలో కోత పెట్టేందుకు ఈపీఎఫ్​వో ఇలా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి.