సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలి

సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలి

ఎంపీ పసునూరి దయాకర్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సకల సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు సామాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దేవేందర్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటుచేసిన సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ కాళహస్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 300 రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో 1001 రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చాయన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం, నోటుబుక్కులు, పాఠ్యపుస్తకాలు అందించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన 200 మంది విద్యార్థులు వృత్తినైపుణ్యాలు, ఆర్ట్, లైఫ్ స్కిల్స్ నేర్చుకుని జీవితంలో స్థిర పడాలి అన్నారు.

ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య మాట్లాడుతూ లక్ష్యాలను ఎంచుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిగమించాలన్నారు. ఒక్కో విద్యార్థికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు వెచ్చిస్తుందని ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకొని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ ల సంక్షేమం జరుగుతుందని ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జయేందర్ అధ్యాపకులు శ్రీకాంత్, ఉమారాణి, చారి, వేదాంత చారి, వేణు, పిడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.