దానం నాగేందర్ ను తొలగించి రాజ్యాంగాన్ని కాపాడండి

దానం నాగేందర్ ను తొలగించి రాజ్యాంగాన్ని కాపాడండి

  •  మంత్రి పొన్నం "ఆవేశం స్టార్"
  •  కెసిఆర్ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
  •  లక్ష మెజారిటీతో కరీంనగర్ ఎంపీ సీటు గెలుస్తాం
  •  హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గా గెలిచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ ను ఎమ్మెల్యే పదవి నుండి తొలగించి స్పీకర్ రాజ్యాంగాన్ని కాపాడాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు. కల్యాణ లక్ష్మి  చెక్కుల  ఆడియో లీక్ వ్యవహారంలో ఆర్డీవో ను బలి చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన నన్ను విస్మరిస్తే హుజురాబాద్ ప్రజలు మంత్రి ని క్షమించరు అన్నారు. పొన్నం కార్యాలయం నుండే ఆడియో లీక్ అయిందని ఈ వ్యవహారం లో మంత్రినే భర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేశారు. అమ్మనగుర్తి  తిరుపతి గౌడ్ వ్యవహారం లో  పొన్నం ప్రభాకర్ ఆవేశంతో  మాట్లాడిన ఆడియో ను మీడియా కు వినిపించారు. సహనం కోల్పోయి ఆవేశంతో ఊగిపోతున్న  పొన్నం ప్రభాకర్ "ఆవేశం స్టార్" గా మారాడు అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా భాష మార్చుకొని గౌరవప్రదంగా వ్యవహరించాలని హితువు పలికారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి కమలాపూర్ మండలంలో 62 చెక్కులు పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసంమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో కేసీఆర్ అత్యధికంగా 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడని దీనిని కాదని ఎవరైనా నిరూపిస్తే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు పి ఆర్ సి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్ష ఓట్ల మెజారిటీతో కరీంనగర్ పార్లమెంట్ సీటును కైవసం చేసుకుంటామని చెప్పారు. కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి నుండి తొలగడంతో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, చల్లా హరిశంకర్, సంపత్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.