కేసుల్లో రాజీ పడితే సమయం, డబ్బు ఇరు వర్గాలకు ఆదా

కేసుల్లో రాజీ పడితే  సమయం, డబ్బు ఇరు వర్గాలకు ఆదా

సిద్దిపేట  జిల్లా న్యాయమూర్తి రఘురాం 

ముద్ర  ప్రతినిధి : సిద్దిపేట: రాజీ మార్గమే రాజ మార్గమని, ఏళ్ల తరబడి నడుస్తున్న కేసులను లోక్ అదాలత్ లో రాజీ ద్వారా పరిష్కరించు కోవాలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి రఘురాం సూచించారు. లోక్ అదాలత్ లో రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారుల విలువైన సమయం తోపాటు డబ్బు కూడా ఆదా అవుతుందన్నారు. కక్షిదారుల సౌకర్యార్థం కోర్టులో నాలుగు బెంచీలు ఏర్పాటు చేసి కేసులను పరిష్కరిస్తున్నా మన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సిద్దిపేట జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం నాడు జాతీయ  మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు.ఈ లోక్ అదాలత్ కార్యక్రమంలో న్యాయమూర్తులు రఘురాం.  భవాని,స్వాతి రెడ్డి,చందన,శ్రావణి యాదవ్ పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి రఘురాం మాట్లాడుతూ పాత కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక అన్నారు.ఇరు వర్గాల ఆమోదం ద్వారా పరిష్కరించబడడం వల్ల ఈ నేరాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయన్నారు.లోక్ అదాలత్ లో ఇరువర్గాలు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఇద్దరూ గెలిచినట్లుగా భావించాలన్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ లో భాగంగా అన్ని కోర్టులలో ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేసి పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరిస్తున్నామని తెలిపారు.అనంతరం కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులు రఘురాం, భవాని,స్వాతి రెడ్డి,చందన,శ్రావణి యాదవ్, స్వయంగా కక్షిదారులకు భోజనం వడ్డించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ,ఏపీపీలు సుప్రియ, రూప, తిరుపతి తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.