ముఖ్యమంత్రి రేసులో వర్గం లేని ‘సమర్ధుడు’ శ్రీధర్ బాబు

ముఖ్యమంత్రి రేసులో వర్గం లేని ‘సమర్ధుడు’ శ్రీధర్ బాబు

మహాదేవపురం, ముద్ర: రాష్ట్రంలో ముఠాలకు, గ్రూపులకు, అతీతంగా, వివాదరహితునిగా అందరికీ ఆమోదయోగ్యమైన నాయకునిగా పేరు పొందిన శ్రీధర్ బాబు సీఎం రేసులో ఉన్నారు.  శ్రీధర్ బాబు సీఎం రేసులో ఉండటం గురించి  మీడియాలో వార్తలు వస్తుండడంతో మంథని నియోజక వర్గ ప్రజలలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలను స్థానిక ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎలాగు రాష్ట్ర మంత్రిగా నియమించబడే శుభవార్త కోసం ఎదురుచూస్తూ భాగ్యనగరానికి బయలుదేరడానికి స్థానిక నేతలు సిద్ధమై ఉన్నారు. శ్రీధర్ బాబు సీఎం రేసులో ఉండటంతో ప్రజలలో ఉత్కంఠ నెలకొన్నది. గతంలో పీవీ నరసింహారావు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మంథనిలో పీవీ నరసింహారావు 4 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొందారగా శ్రీధర్ బాబు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించి ప్రభుత్వ నిర్వహణలో అపార అనుభవాన్ని గడించారు. ఐదు మార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ’పీవీ’ రికార్డును అధిగమించిన శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అయితే మంథని నుండి పదవిని సాధించిన రెండవ ఎమ్మెల్యేగా చరిత్ర కెక్కుతారు. శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. నిజమైన స్వాతంత్ర్యానికి ప్రతిరూపం కాంగ్రెస్ పార్టీ అని పార్టీ నేతలు వర్ణించుకుంటారు. బయటివారు మాత్రం అంతర్గత కలహాలకు కాంగ్రెస్ పార్టీ నిలయమంటారు.

సీఎం రేసులో సందిగ్ధత నెలకొనడంతో అందరి దృష్టి శ్రీధర్ బాబు పై పడే అవకాశాలను ప్రజలు తోసిపారేయలేకపోతున్నారు. ఏర్పడబోయే ప్రభుత్వం ముందు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఒకవైపు, అప్పులు, నిధుల కొరతల మధ్య ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ఒక సవాలైతే ముఖ్యమంత్రి ఎవనేది మరో సమస్య. రాష్ట్ర మంత్రిగా అపార అనుభవం, వ్యవహార దక్షత, రాజ్యాంగ, చట్ట, విధానపర సమస్యలను పరిష్కరించగల, అందరిని సమన్వయం చేయగల, పార్టీలోని ముఖ్యులకు తలలోనాలుకలా ఉండే శ్రీధర్ బాబు పై ఢిల్లీ నాయకత్వం చూపు పడాలని మంథని ప్రజలు ఆశిస్తున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబు మల్లికార్జున ఖర్గే దృష్టిని ఆకర్షించారు. ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలు ముఖ్యమంత్రి రేసులో ఉన్న శ్రీధర్ బాబుకు కలిసి వస్తుందని పలువురు భావిస్తున్నారు. శ్రీధర్ బాబు తండ్రిగారైన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పనిచేసినందున ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, ఢిల్లీలోని పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏ విధంగా చూసిన ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టడానికి కావలసిన అర్హతలన్నీ ఉన్న శ్రీధర్ బాబు సమర్థతను గుర్తించి, రాష్ట్ర నాయకత్వంలో ఏకాభిప్రాయం కుదిరితే ముఖ్యమంత్రి  పదవిలో కూర్చుండే యోగం కష్టమేమీ కాదని మంథనిలో రాజకీయాలలో తలపండినవారి ఆకాంక్ష. అదే జరిగితే మంథని నియోజకవర్గానికి మరో ‘పీవీ’గా శ్రీధర్ బాబు కీర్తి గడిస్తారు.